రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ కమిషనర్లు, రహదారులు, భవనాల శాఖ అధికారులలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు–2025, రోడ్ సేఫ్టీ సంబంధిత అంశాలపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత శాఖాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మోటారు వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్నారు. ప్రతి కుటుంబంలో కనీసం రెండు వాహనాలు ఉన్నాయన్నారు. రద్దీకి తగ్గట్లు రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అతి వేగంతో వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా నడిపించడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పాటించకపోవడం వంటివి రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురైన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో అవగాహన ర్యాలీలు తీయాలన్నారు. ప్రతి మండలంలో కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని, ప్రమాదానికి కారణమైన వివరాలను సేకరించి ప్రత్యామ్నాయ చర్యల కోసం ఉన్నతాధికారులు తెలిపే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణా రెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, ఆర్టీసీ, ట్రాఫిక్, ఆర్‌అండ్‌బీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment