మాట ఇచ్చి తప్పొద్దు
● భూ రికార్డులను రైతుల పేరిట నమోదు చేయాలి
● ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు
యాచారం: అధికారంలో ఉన్న పెద్దలు ఇచ్చిన మాట తప్పొద్దు.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి బలవంత భూసేకరణలో టీజీఐఐసీ పేరు మార్చిన భూ రికార్డులను వెంటనే రైతుల పేరిట నమోదు చేయించాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని నానక్‌నగర్‌లో శనివారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి గ్రామాల రైతులు సమావేశమయ్యారు. సమావేశానికి పర్యావరణ వేత్తలు, హైకోర్టు లాయర్లు, మానవ హక్కుల వేదిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సర్కార్ లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చి అధికారంలోకి రాగానే తప్పుతున్నారని అన్నారు. నాలుగు గ్రామాల్లోని 2,200 ఎకరాల రైతుల పట్టా భూముల రికార్డులను కనీస సమాచార ఇవ్వకుండా అప్పటి అధికారులు టీజీఐఐసీ పేరిట మార్చారని మండిపడ్డారు. మూడేళ్లుగా తమ పట్టా భూముల రికార్డులను టీజీఐఐసీ పేరు తీసేసి తమ పేరిట మార్చాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్న పట్టింపు లేదని విమర్శించారు. ఇప్పటికై నా రైతులకు న్యాయం చేయాలని, ఫార్మాసిటీ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా రైతులు సమావేశం కావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ కృష్ణంరాజు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేశారు. కార్యక్రమంలో పర్యావరణవేత్తలు బాబురావు, కవుల సరస్వతి, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment