ఏ మున్సిపాలిటీకి ఎంతంటే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధుల వరద కురిపించింది. గడువు ముగిసే వేళ పెద్ద మొత్తంలో నిధులు జమ చేయడంతో పాలక మండళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చిన నిధులను వార్డుల వారీగా విభజించి, ఆఘమేఘాల మీద సీసీరోడ్లు, డ్రైనేజీ కాల్వలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. నిజానికి స్టాంప్స్ డ్యూటీ (టీడీ ఫండ్), మ్యూటేషన్ ఫీజులు 2019 నుంచి ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తిపన్ను, ఇంటి నిర్మాణాలకు అనుమతుల ద్వారా వచ్చే ఫీజులు మున్సిపాలిటీల నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. దీంతో జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలు ఐదేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. చిన్నచిన్న పనులకు ప్రభుత్వం విధిల్చే నిధులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రేవంత్‌రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక సంస్థలకు ఈ నిధులను విడుదల చేయించారు. ప్రస్తుత పాలక మండళ్ల గడువు ముగియనుండడం.. త్వరలోనే వాటికి ఎన్నికలు రానుండటం, మెజార్టీ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించడం తె లిసిందే. ఈలోపే ఆయా మున్సిపాలిటీల్లో తమ మార్క్ చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భారీగా నిధులు కేటాయించి, వాటికి శంకుస్థాపనలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవచ్చని భావిస్తున్నారు.
అధికారుల హడావుడి
ఐదేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఖాతాల్లో ప్రభుత్వం భారీగా నిధులు జమ చేయడం, పాలక మండళ్ల గడువు కూడా ముగియనుండటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. ఇప్పటి వరకు ప్రజలు, కౌన్సిలర్లు/కార్పొరేటర్ల నుంచి వచ్చిన అర్జీలతో పాటు వార్డుల వారీగా ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించే పనిలో ఇంజనీరింగ్ విభాగం నిమగ్నమైంది. చేపట్టాల్సిన పనులకు అంచనాలు రూపొందిస్తున్నారు. చివరి ఈ ఐదు రోజుల్లో వార్డుల వారీగా నిధులు ఏరులై పారే అవకాశం లేకపోలేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పనులకు శంకుస్థాపనలు చేసిన సభ్యులు.. ఆఖరి రోజు మరిన్ని పనులను మొదలు పెట్టే అవకాశం ఉంది.
కై ్లమాక్స్ మార్క్
మున్సిపాలిటీ పాలకమండళ్లకుమిగిలింది కొద్ది రోజులే ..
గడువు ముగిసే వేళ కాసుల గలగల
నిధుల వరద కురిపించిన ప్రభుత్వం
సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు
ఆయా పురపాలికల్లో జోరుగా అభివృద్ధి పనులు
తుక్కుగూడ మున్సిపాలిటీకి రూ.32 కోట్లు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.17.74 కోట్లు.
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీకి రూ.35 కోట్లు. 24 వార్డులు ఉండగా, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం ఒక్కో వార్డుకు రూ.50 లక్షల చొప్పున కేటాయించారు.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.87 కోట్లు. నాలుగైదు రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్ల వారీగా నిధులు కేటాయించనున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.6.35 కోట్లు. ఇప్పటికే ఈ నిధులను సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు కేటాయించారు.
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలో రూ.96.73 కోట్లు.
కొత్తూరు మున్సిపాలిటీ ఖాతాలో రూ.50 కోట్లు. వీటిలో పూలే విగ్రహం నుంచి వినయకాస్టీల్ కూడలి వరకు సీసీరోడ్డు పనులకు రూ.18 కోట్లు, ఎస్సీకాలనీ నుంచి కుమ్మరిగూడ చేగూర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులకు రూ.32 కోట్లు కేటాయించారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఖాతాలో రూ.49 కోట్లు. త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించనున్నారు.
శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అమృత్ 2.0 కింద రూ.32.47 కోట్లు మంజూరు చేయించి, ఈ మేరకు ఇటీవల తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment