ఉపాధి హామీ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉపాధి హామీ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కందుకూరి నాగభూషణం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ.. ఉపాధి హామీలో పని చేస్తున్న ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్షేత్ర సహాయకులు, ఇతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని అన్నారు. దీంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేక, ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకోసం సెలవులు లేకున్నా నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయలని కోరారు. మంత్రి సీతక్క పేస్కేల్ ఇస్తున్నట్లు ప్రకటించి నేటికీ అమలు చేయడం లేదని వాపోయారు. పెండింగ్ జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షులు చరణ్, గౌతం, జనరల్ సెక్రెటరీ తిరుపతాచారి, కో చైర్మన్ నర్సింహులు, వీరాసింగ్, లలిత, కోశాధికారి లలిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment