పేద పిల్లలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

పేద పిల్లలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం

Published Sat, Oct 19 2024 7:16 AM | Last Updated on Sat, Oct 19 2024 7:16 AM

పేద పిల్లలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం

నారాయణఖేడ్‌: పేద విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా ‘బ్రైల్ట్‌ చైల్డ్‌ ఫౌండేషన్‌’ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్‌ విద్యను అందిస్తున్నారు. నారాయణఖేడ్‌లో మరో పాఠశాలలో కంప్యూటర్‌ విద్యను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్‌ విద్య ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో పేద విద్యార్థులను ఆ విద్య వైపు మళ్లేలా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు డబ్బులు వెచ్చించి కంప్యూటర్‌ విద్య, పరిజ్ఞానం పొందలేక వారి ప్రతిభ, నైపుణ్యతను వెలికి తీయలేకపోతున్నారు. ఈ సమస్య నివారణకు సంస్థ నడుం కట్టింది. రాష్ట్రంలో ఇటీవల పాలకుర్తిలో 2 పాఠశాలలు, నారాయణఖేడ్‌లో 2, సంగారెడ్డిలో 1, హైదరాబాద్‌లో కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌, అసెంబ్లీ ప్రాంతంలలో 4 పాఠశాలలు, ఖమ్మంలో 2 పాఠశాలల చొప్పున ఇటీవల కంప్యూటర్‌ విద్యను ప్రారంభించారు. నారాయణఖేడ్‌ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి ఉండడంతో ఈ ప్రాంతంపై మరింత దృష్టి సారించారు. విడతల వారీగా మెజార్టీ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

ఒక్కో పాఠశాలకు రూ.5లక్షల ఖర్చు

ఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న కంప్యూటర్‌ విద్యకు సుమారు రూ.5లక్షల వరకు ఖర్చవుతుంది. పాఠశాలలో 10 కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోని ఉద్యోగులను ఫ్యాకల్టీలుగా ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందజేస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వరకు కంప్యూటర్‌ విద్యాబోధన జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 10వేల మంది విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించారు. మూడు నెలలకు ఒక బ్యాచ్‌ చొప్పున అన్ని తరగతుల విద్యార్థులకు విద్యను అందజేస్తున్నారు. నారాయణఖేడ్‌లోని ఉన్నత పాఠశాలలో 800మంది విద్యార్థులు, బాలికల ఉన్నత పాఠశాలలో 900మంది విద్యార్థులు ఉండగా రెండు చొప్పున కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. నెలరోజుల్లో ఉన్నత పాఠశాలలో 70మంది, బాలికల ఉన్నత పాటశాలలో 85మంది విద్యార్థులు కంప్యూటర్‌ విద్యను పొందారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ను సంస్థ ద్వారా ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

సర్కారు బడుల్లో ఉచిత బోధన

బ్రైట్‌ చైల్డ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు

ఖేడ్‌లో మూడో పాఠశాలలో ఏర్పాటు

నియోజకవర్గంలో విస్తరణకు చర్యలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement