తుది దశకు ఇందిరమ్మ కమిటీలు | - | Sakshi
Sakshi News home page

తుది దశకు ఇందిరమ్మ కమిటీలు

Published Sat, Oct 19 2024 7:18 AM | Last Updated on Sat, Oct 19 2024 7:18 AM

తుది దశకు ఇందిరమ్మ కమిటీలు

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇందిరమ్మ కమిటీలను వేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున, మున్సిపల్‌ పరిధిలోని వార్డుకు ఒకటి చొప్పున ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఏడుగురు సభ్యులతో కలిసి ఒక కమిటీ ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ లేదా ప్రత్యేక అధికారి, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఇద్దరూ, ముగ్గురు స్థానికులతో పాటు పంచాయతీ కార్యదర్శి ఉంటారు. గ్రామాలలో ప్రతిపాదించిన కమిటీల ప్రక్రియ అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి తోపాటు కలెక్టర్‌తో సంప్రదించి అధికారికంగా ప్రకటించి, విధి విధానాలను జారీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 646 గ్రామ పంచాయతీలు, ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి తొలుత 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎంపికై న లబ్ధిదారులకు రూ.5లక్షలు మంజూరు చేయనుంది. గ్రామాలలో నూతనంగా ఏర్పడిన ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నూతనంగా ఏర్పడిన కమిటీ చేపట్టనుంది. ఇళ్ల నిర్మాణాలలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.

పారదర్శకంగా కమిటీలు: గూడెం

పటాన్‌చెరు: ఇందిరమ్మ కమిటీల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఆదేశించారు. పటాన్‌చెరులోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగా గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామ కమిటీలు, వార్డు కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సొంతంగా ఖాళీగా జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం అందించనున్నట్లు తెలిపారు. నిరుపేదలకు జాగా లేకుంటే అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వారికి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవకతవకలు జరగడానికి వీలు లేదన్నారు. త్వరలోనే ప్రభుత్వం లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనుందని పేర్కొన్నారు.

ఏడుగురితో కలిసి ఒక కమిటీ

పారదర్శకంగా చేపట్టాలని సర్కార్‌ ఆదేశం

నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement