ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకే..
జహీరాబాద్ టౌన్: ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా విధులు నిర్వహించినందుకు రాష్ట్ర ఫైర్‌సర్వీసెస్ శౌర్య పతకం లభించిందని జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రంలోని లీఇంగ్ ఫైర్‌మన్ బి. శ్రీనివాస్ అన్నారు. పతకం లభించిన ఆనందాన్ని ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. తన స్వగ్రామం ఝరాసంగం మండలంలోని బిడకన్నె అని చెప్పారు. 2011లో అగ్నిమాపక శాఖలో చేరగా...2017 వరకు మెదక్, 2017–20 వరకు సదాశివపేట, 2020–24 వరకు సంగారెడ్డి అగ్నిమాపక కేంద్రంలో పనిచేసి జూన్ 24న జహీరాబాద్‌కు బదిలీపై వచ్చినట్లు తెలిపారు. ‘‘సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కెమికల్ పరిశ్రమల్లో భారీ ప్రమాదం చోటు చేసుకోగా ఆ పరిశ్రమకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్నాను. వెంటనే స్పందించి పది నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాను. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాను. అప్పటికే ఒక రియాక్టర్ పేలగా.. పక్కనే పేలడానికి సిద్ధంగా ఉన్న మరో రియాక్టర్‌ను బ్లాస్ట్ కాకుండా నియంత్రించాను. దీంతో ప్రాణహాని, ఆస్తి నష్టం జరగలేదు. అదేవిధంగా పాశమైలారంలోని ఓ పరిశ్రమలో కూడా భారీ ప్రమాదం జరగ్గా...వెంటనే రంగంలోకి దిగి ఆస్తి నష్టం, ప్రాణహాని జరగకుండా చురుగ్గా వ్యవహరించాను. రిస్క్ కాల్స్ అటెండ్ చేసి సుమారు 10 మందికి పైగా ప్రాణాలను కాపాడాను. మంజీర డ్యామ్‌లోని 10 వరకు మృతదేహాలను బయటకు తీశాను. అందుకే ఈ పతకం లభించి’’నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment