ప్రయోగాలకు పరికరాలేవీ?
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఎంతో కీలకం. అలాంటిది ప్రాక్టికల్ పరీక్షలకు ఇంకా 13 రోజులే సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాలలో కనీసం 25% కూడా విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించలేదు. చాలా కళాశాలల్లో సరిపడా ల్యాబ్‌లు, పరికరాలు లేకపోవడంతో పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రయోగాలకు సంబంధించి పరికరాలను సరఫరా చేసేది. ఈసారి మాత్రం పరికరాల కొనుగోలుకు చాలీచాలని నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది.
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
జిల్లావ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో7,514 మంది విద్యార్థులున్నారు. ప్రథమ సంవత్సరంలో 4,118 మంది విద్యార్థులుండగా, ద్వితీయ సంవత్సరంలో 3,396 మంది విద్యార్థులున్నారు. ప్రయోగాలకు చేయించేందుకు సరైన పరికరాలు లేకపోవడంతో ఇప్పటివరకు 50% ప్రాక్టికల్స్ కూడా చేయించలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు ప్రయోగ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఒక్కో కళాశాలకు రూ.25 వేలు మంజూరు చేసింది. ఈ చాలీచాలని నిధులను నవంబర్ చివరి మాసంలో విడుదల చేయడంతో సైన్స్ అధ్యాపకులు అసహనం వ్యక్తం చేశారు. జంతు, వృక్ష, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి నాలుగు ల్యాబ్‌లకు రూ.25 వేలు మంజూరు చేస్తే పరికరాలను ఎలా కొనుగోలు చేయాలని వాపోతున్నారు.
ప్రాక్టికల్స్ ముగిసేనా!
ప్రతీ ఏటా ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభం అవుతుండటంతో ఇంకా పరీక్షలకు 13 రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 90 రోజుల ప్రణాళికతో సిలబస్ పూర్తి చేసి రివిజన్ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఇంకా 13 రోజులే
50 శాతం ప్రాక్టికల్స్ కూడా
పూర్తి కాని వైనం
విద్యార్థుల్లో ఆందోళన
నిధులు విడుదల చేశాం
ప్రయోగ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఒక్కో కళాశాలకు రూ.25 వేలు మంజూరయ్యాయి. నిధులను విడుదల చేసి కూడా రెండు నెలలైంది. అన్ని కళాశాలల్లో పరికరాలను కొనుగోలు చేసి ప్రాక్టికల్స్ ప్రారంభించారు. పరీక్షల సమయానికి ప్రాక్టికల్స్‌ను పూర్తి చేస్తాం.
–గోవిందరాం, ఇంటర్మీడియెట్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment