స్పందన సరే.. అవగాహనేది?
● పోలీసు పనితీరుపై క్యూఆర్ కోడ్‌తో స్పందన ● దీనిపై సమాచారం లేదంటున్న ఫిర్యాదుదారులు
పటాన్‌చెరుటౌన్: పోలీసుల పనితీరు పట్ల ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఇటీవల పోలీసు శాఖ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన తర్వాత వారికి అందుతున్న సేవలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో వచ్చే ఫారంపై వివరాలు ఇవ్వాలి. అయితే స్కాన్ చేసిన వెంటనే ఫోన్ లోకి తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉండే ఒక ఫారం వస్తోంది. వివరాలను అందులో పూరించి పంపించాల్సి ఉంటుంది. ఫోన్‌లో టైప్ చేయడం సాధ్యం కాని వారు వాయిస్ రూపంలో కూడా తమ అభిప్రాయాలను తెలిపే వీలు కల్పించారు. ఇలాంటి వారికి ఆటోమేటిక్ కాలింగ్ యాప్ ద్వారా ఫోన్ చేసి అభిప్రాయాలను సేకరిస్తారు. ఇది నేరుగా హైదరాబాద్ డీజీ కార్యాలయానికి చేరుతుంది. ప్రస్తుతం పిటిషన్, ఎఫ్‌ఐఆర్, ఈ–చలానా, పాస్‌పోర్ట్ పరిశీల విభాగాల్లో అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా పోలీస్ స్టేషన్లకు ర్యాంకులను ఇస్తారు. అయితే ఈ విధానానికి ఇంకా సరైన స్పందన లభించడంలేదు. స్టేషన్ వచ్చి ఫిర్యాదుదారులకు ఆ విధానంపై అవగాహన లేకపోవడమేనని ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారులకు కనిపించే విధంగా ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. స్టేషన్ వచ్చిన ఫిర్యాదుదారులు కొంతమంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఆసక్తి చూపగా ఎక్కువమంది అంతగా ఆసక్తి చూపించలేదు. ఇందుకు ఈ క్యూఆర్‌కోడ్ విధానంపై సరైన అవగాహన లేకపోవడమేనని వారు చెబుతున్నారు.
ఫీడ్ బ్యాక్ ఇస్తున్న ఫిర్యాదుదారు
అవగాహన కల్పించాలి..
ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్‌పై స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు అవగాహన కల్పించాలి. దీని గురించి నాకు ఈ రోజే తెలిసింది. ఫీడ్ బ్యాక్ విధానం ద్వారా పోలీసులు ఇంకా బాగా పనిచేస్తారని భావిస్తున్నా. గొడవ జరిగిందని పోలీస్‌స్టేషన్ కు వచ్చాను. అధికారులు స్పందించి కేసు నమోదు చేశారు. దీనిపై ఫీడ్ బ్యాక్ పనితీరు బాగుందని ఇచ్చాను.
–రమేశ్, పటాన్‌చెరు
బాధితులకు అండగా...
రెండు రోజుల క్రితం ఫోన్ పోయింది. దీంతో పోలీస్‌స్టేషన్‌కు వస్తే, మీ సేవలో ఫోన్ లాస్ట్ అని అప్లై చేసుకుని రశీదు తీసుకు రమ్మన్నారు. మీసేవ రశీదు తీసుకుని వచ్చాక సీఈఐఆర్ పోర్టల్‌లో ఎలా నమోదు చేయాలో వివరించారు. ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ పోలీస్ శాఖ ప్రవేశ పెట్టిందనే విషయం తెలియదు. ఈ విధానం బాధితులకు అండగా నిలుస్తుందని అనుకుంటున్నా.
– సాయికుమార్ , వెంకటేశ్వర కాలనీ
Comments
Please login to add a commentAdd a comment