నమ్మించి.. నట్టేట ముంచి..
నారాయణఖేడ్: తనకు సంతానం లేకపోవడంతో పోషిస్తానని నమ్మించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఖేడ్ మండలం గంగాపూర్‌కు చెందిన రైతు భీమిని విఠల్ తన గోడు వెల్లబోసుకున్నాడు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తనకు సంతానం లేకపోవడంతో నేను పోషిస్తానని చెప్పి తన భార్య చెల్లెలి కుమారుడు రాయికోడు మండలం సంగాపూర్‌కు చెందిన అంజయ్య ఏడాది కిందట ఇంటికొచ్చాడన్నారు. నాలుగు నెలలపాటు ఉండి బాగోగులు చూసుకుంటున్నాడన్నారు. మాయమాటలతో తనను నమ్మించి నాలుగు ఎకరాలను అతడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత సొంతూరికి వెళ్లి రావడంలేదన్నారు. తన ఆరోగ్యం బాగాలేక పలుమార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆ భూమిని తిరిగి తనపేరిట రిజిష్ట్రేషన్ చేయించి న్యాయం చేయాలని కోరారు. అతడి వెంట మాజీ ఎంపీటీసీ దత్తాగౌడ్, బంజారా సేవాలాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, నాయకులు శంకర్ ముదిరాజ్ ఉన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోషిస్తానని మాయమాటలు చెప్పి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి
న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment