కంకర పోశారు.. వదిలేశారు
● అక్కన్నపేట మండలంలో అధ్వానంగా రోడ్లు
అక్కన్నపేట(హుస్నాబాద్): రోడ్డు నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో అటు ప్రజలు ఇటు రైతుల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అక్కన్నపేట మండలం కట్కూర్ నుంచి దాస్‌తండా, వంకాయతండా వయా పంచరాయితండాలకు వెళ్లే కంకర రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుకు గత ప్రభుత్వ హయాంలో గిరిజన శాఖ కింద రూ.3.20 కోట్లు మంజూరు అయ్యాయి. పనులు ప్రారంభించి కంకర పోసి బీటీ రోడ్డు నిర్మాణం వేయలేదు. దీంతో అదే కంకర రోడ్డుపై నిత్యం వందలాది మంది రైతులు, ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. వంకాయతండా, దాస్, పంచరాయితండాల రైతులు ఉదయం, సాయంత్రం పాలు పోసేందుకు కట్కూర్ లోని పాల కేంద్రానికి వెళ్తుంటారు. ఇటీవల ఓ రైతు ప్రమాదానికి గురయ్యాడు. ఐదారు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పడి వాహనదారులు గాయాల పాలయ్యారు. ఇకనైనా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి బీటీ రోడ్డు వేయించాలని రైతులు కోరుతున్నారు.
బార్‌లో కత్తులతో హల్‌చల్
ముగ్గురిపై కేసు
తూప్రాన్: మద్యం కోసం ముగ్గురు యువకులు కత్తులతో బారులో హల్‌చల్ చేశారు. ఎస్‌ఐ శివానందం బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న దారువాల బార్ రాత్రి బంద్ చేసిన అనంతరం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మద్యం కావాలని డిమాండ్ చేస్తూ కత్తులతో భయబ్రాంతులకు గురి చేశారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని సంతోష్‌సింగ్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment