నవోదయం.. సర్వం సన్నద్ధం
రేపే ప్రవేశ పరీక్ష
● రాయనున్న 6,465 మంది విద్యార్థులు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలు
● నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
● సందేహాల నివృత్తికి ‘హెల్ప్ డెస్క్’
● వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్ రాజేందర్
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, వర్గల్ నవోదయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విధి విధానాలపై జిల్లాల వారీగా సెంటర్ లెవెల్ అబ్జర్వర్లు, సెంటర్ సూపరింటెండెంట్లకు ఓరియంటేషన్ కార్యక్రమం సైతం నిర్వహించారు. పరీక్ష వేళ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక ‘హెల్ప్‌డెస్క్’ ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు
● నవోదయ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,465 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం వివిధ ప్రాంతాల్లో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
● సిద్దిపేట జిల్లాలో 2,250 మంది విద్యార్థులకు 10 పరీక్ష కేంద్రాలు, మెదక్ జిల్లాలో 1,589 విద్యార్థులకు 8, సంగారెడ్డి జిల్లాలో 2,626 మందికి 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
● పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు ప్రతీ కేంద్రంలో ఒక సెంటర్ సూపరిండెంట్, ఒక సెంటర్ లెవల్ అబ్జర్వర్‌ను నియమించారు.
● 24 మంది విద్యార్థులకు ఒక గది, ఒక ఇన్విజిలేటర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రాలపై పర్యవేక్షణ బాధ్యతను మండల విద్యాధికారులకు అప్పగించారు.
● ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహణకు 8న జిల్లా ప్రధాన కేంద్రాలలో శిక్షణ, అవగాహన కార్యక్రమం సైతం పూర్తి చేశారు.
గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి
● నవోదయ ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు తొందరపాటుకు, ఒత్తిడికి గురి కాకుండా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
● తమ వెంట హాల్‌టికెట్ (అడ్మిట్ కార్డు), రైటింగ్ ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని రావాలి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది.
హెల్ప్ డెస్క్ నంబర్లు:
ఎం. శ్రీనివాస్‌రావు (జేఎన్‌వీఎస్‌టీ ఇన్‌చార్జి): 73823 35164
ఎం.జీ. సోని (ఎల్‌డీసీ): 94489 01318
దాసి.రాజేందర్ (నవోదయ ప్రిన్సిపాల్): 99215 55310
మూడు భాగాలుగా పరీక్ష
నవోదయ ప్రవేశ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. అన్ని ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఉంటాయి. 80 ప్రశ్నలకు 100 మార్కులు. ఒక్కో సమాధానానికి 1.25 మార్కులు. మేధాశక్తి ప్రశ్నలు 40, గణిత ప్రశ్నలు 20, భాషా పరీక్ష ప్రశ్నలు 20 ఉంటాయి. ఓఎమ్‌ఆర్ షీట్‌లో ప్రశ్నకు సంబంధించిన జవాబుకు ఇవ్వబడిన నాలుగు వృత్తాల్లో సరైన వృత్తాన్ని లోపల ఖాళీ వదలకుండా, గీత దాటకుండా నిండుగా పెన్నుతో ‘బబ్లింగ్’ చేయాలి. సజావుగా పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చే శాం. శిక్షణ, పునశ్చరణ తదితర కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాల అధికారులతో కలిసి సంయుక్తంగా పూర్తి చేశాం.
– రాజేందర్ ,నవోదయ ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment