మాజీ సర్పంచ్ ఇంట్లో చోరీ
రూ.లక్ష నగదు, 2 తులాల బంగారం, అరకిలో వెండి అపహరణ
వట్‌పల్లి(అందోల్): మాజీ సర్పంచ్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన అందోలు మండల పరిధిలోని అక్సాన్‌పల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని తాడ్మన్నూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీ భర్తతో కలిసి కొన్నేళ్లుగా అక్సాన్‌పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. మియాపూర్‌లో కూడా వీరికి ఇల్లు ఉండగా 3న అక్కడికి వెళ్లారు. గురువారం ఉదయం వీరి ఇంటి పక్కన నివాసం ఉండే దశరథ్ అనే వ్యక్తి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తలు ఇంటికి చేరుకొని జోగిపేట పోలీసులకు విషయం చెప్పారు. ఏఎస్‌ఐ గౌస్‌తోపాటు పోలీసు సిబ్బంది ఇంటిని పరిశీలించగా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఉన్నాయి. మాజీ సర్పంచ్ భర్త, పీఏసీఎస్ డైరెక్టర్ నర్సింలు ఇంట్లో రూ.లక్ష నగదుతోపాటు రెండు తులాల బంగారం, అరకిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్లు జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ గౌడ్ పేర్కొన్నారు. అలాగే, అదే గ్రామంలోని మరికొందరి ఇళ్ల తాళాలను దొంగలు పగులగొట్టారు. వీరితోపాటు మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి రెండు ఎరువుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఇంటికి కొంత దూరంలో పడేశారు. ఈ ఘటనలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
దేవాలయాల్లో కన్నం..
కొల్చారం(నర్సాపూర్): దేవాలయాలే లక్ష్యంగా దొంగలు చోరీలకి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని రెండు వేర్వే రు గ్రామాల్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాంపూర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం తలుపులకు కన్నం వేసిన దొంగలు అమ్మవారి ముక్కుపుడకతోపాటు వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. ఎనగండ్ల గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం తాళాన్ని పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. దొంగతనాలపై సదరు దేవాలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు.
సబ్‌స్టేషన్ నుంచి ఇనుప రాడ్లు
గజ్వేల్‌రూరల్: సబ్‌స్టేషన్‌లో నుంచి ఇనుప రాడ్లు చోరీకి గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అక్కారం శివారులో గల కోనాపూర్ వద్ద ఉన్న సబ్‌స్టేషన్‌లో విద్యుత్ శాఖకు సంబంధించిన 9 (డిశ్చార్జ్ రాడ్స్) ఇనుప రాడ్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ శాఖ అధికారులు గజ్వేల్ పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్‌శ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment