అదృశ్యమైన బాలిక శవమైంది
రాయికోడ్(అందోల్): వారం రోజుల కిందట అదృశ్యమైన బాలిక అనుమానాస్పదంగా బావిలో శవమై తేలింది. ఎస్‌ఐ నారాయణ కథనం మేరకు మండలంలోని సంగాపూర్ గ్రామానికి చెందిన ఎం.సతీష్, అనిత దంపతులకు ఇద్దరు కూతుర్లు. కొద్ది నెలల కిందట భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో అనిత ఇస్నాపూర్‌లోని బంధువుల వద్ద ఉంటుంది. ఇటీవల చిన్నకూతురు హరిత (6) మృతి చెందినా అనిత అంత్యక్రియలకు రాలేదు. వీరి పెద్దకూతురు వైష్ణవి సంగాపూర్ గ్రామంలో నానమ్మ ఇంటి వద్ద ఉంటోంది. 9వ తేదీన వైష్ణవి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నానమ్మ, తండ్రి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా వైష్ణవి మృతదేహమేనని కుటుంబీకులు నిర్ధారించారు. బాలిక మృతిపై అనుమానాలున్నాయని నానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు. కొన్ని నెలల వ్యవధిలోనే అక్కాచెల్లెళ్లు మృతి చెందడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రమాదవశాత్తు కాల్వలో పడి రైతు..
గజ్వేల్‌రూరల్: ప్రమాదవశాత్తు కాల్వలో పడి రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్‌లో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాడ కిష్టారెడ్డి వ్యవసాయ పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూడవెల్లి వాగు లో కలిసే పిల్లవాగులో వేసిన వ్యవసాయ మోటార్ పని చేయకపోవడంతో బుధవారం మధ్యాహ్నం సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని వాగులో గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం మరోసారి గాలించగా కిష్టారెడ్డి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పదంగా వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్‌చెరులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటరెడ్డి కథనం మేరకు.. పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో ఉండే ఈర్ల గణేశ్ (40) సొంత ఇంటిని కొంతకాలం కిందట అమ్ముకొని నిజామాబాద్ జిల్లాలో ఉంటున్నాడు. మూడు రోజుల కిందట వీకర్ సెక్షన్ కాలనీలో బంధువు చనిపోవడంతో కుటుంబంతో కలిసొచ్చాడు. ఇక్కడే ఏదైనా పని చేసుకొని ఉందామని ఇంద్రేశం శివారులోని పాడుబడిన రైస్ మిల్లులో ఉంటూ అక్కడే కూలీ పని చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి అందరూ రైస్ మిల్లు వరండాలో నిద్రించగా తెల్లవారి చూసేసరికి గణేశ్ రైస్ మిల్ స్తంభానికి కట్టిన తాడుకు వేలాడుతూ చనిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి గణేశ్‌ను కిందకు దింపి చూడగా మెడపై గాయాలు ఉన్నాయి. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
అనుమానాస్పదంగా బావిలో మృతదేహం లభ్యం
నెలల వ్యవధిలోనే అక్కాచెల్లెళ్లు మృతి
రాయికోడ్ మండలం సంగాపూర్ గ్రామంలో విషాదం
Comments
Please login to add a commentAdd a comment