పార్క్ నిర్మాణం.. ఇదిగో ఆహ్లాదం
దుబ్బాకటౌన్: దుబ్బాక అభివృద్ధే లక్ష్యంగా దుబ్బాక మున్సిపల్ పాలక వర్గం ముందుకు సాగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పోవడంతో పెద్దలు, పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసలవుతున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గతంలోనే దుబ్బాక పాలక వార్గం పలు వార్డుల్లో ఓపెన్ జిమ్‌లను ప్రారంభించగా, నేడు పిల్లల కోసం పట్టణంలో 18వ వార్డులో సకల వసతులతో పార్క్‌ను ఏర్పాటు చేశారు.
ఎట్టకేలకు.. మూడేళ్లకు
దుబ్బాక పట్టణంలో ప్రభుత్వ నంబర్ వన్ పాఠశాల సమీపంలో వెయ్యి గజాల ప్రభుత్వ స్థలంలో పిల్లల పార్క్ నిర్మాణానికి రూ.40 లక్షల వ్యయంతో 2021 సంవత్సరంలో అధికారులు చర్యలు చేపట్టారు. పలు కారణాలతో పార్క్ ఏర్పాటు ఆలస్యమవుతూ వ చ్చింది. ఎన్నో అవరోధాలను దాటి మూడేళ్ల తర్వాత పార్క్ నిర్మాణం పూర్తయ్యింది. 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులను కలుపుకొని అధికారులు పార్క్ నిర్మాణం పూర్తి చేశారు. దుబ్బాక పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో రూ.73 లక్షల టీఎఫ్‌ఎడీసీ నిధులతో 2021 సంవత్సరంలో అధికారులు మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రం (ఎఫ్‌ఎస్‌టీపీ) నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ప్రారంభం పలుమార్లు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
మంత్రి కొండా సురేఖతో ప్రారంభం
శనివారం పార్క్‌ను, ఎఫ్‌ఎస్‌టీపీని ప్రారంభించనున్నారు. ప్రారంభానికి సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు.
దుబ్బాకలో సిద్ధమైన పార్క్, ఎఫ్‌ఎస్‌టీపీ
రూ.40 లక్షలతో పిల్లల కోసం ఏర్పాటు
రూ.73 లక్షలతో ఎఫ్‌ఎస్‌టీపీ నిర్మాణం
ప్రజలకు నిత్యం ఆహ్లాదకర వాతావరణం
నేడు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభం
ఎన్నో అవరోధాలను దాటి
దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సాయ శక్తుల కృషి చేస్తున్నాం. పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేళ్లు అవుతుంది. పలు కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. ఎన్నో అవరోధాలను దాటి సకల వసతులతో పార్క్‌ను పట్టణ వాసుల పిల్లల కోసం సిద్ధం చేశాం.
–గన్నె వనిత,
మున్సిపల్ చైర్‌పర్సన్
ప్రారంభానికి సర్వం సిద్ధం
దుబ్బాక పట్టణంలోని 18వ వార్డులో పిల్లల పార్కు, పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో గల మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రం ప్రారంభానికి సర్వం సిద్ధం చేశాం. – రమేశ్ కుమార్,
మున్సిపల్ కమిషనర్
పిల్లలకు, పాఠశాల విద్యార్థులకు
ఆహ్లాదకరమైన వాతావరణంలో, సకల వసతులతో పార్క్‌ను అందంగా తీర్చిదిద్దారు. పార్క్ చుట్టూ ప్రహరీ, నీటి సౌకర్యం, ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. పిల్లల మనస్సును మంత్ర ముగ్దులను చేసేలా చెట్ల పత్రాల ఆకారంలో లైట్లు, వివిధ పండ్ల ఆకారంలో కుర్చీలను ఏర్పాటు చేశారు. పార్క్ మధ్యలో పచ్చటి గడ్డితో తల్లి, బిడ్డను పోలిన అందమైన ఆకృతిని అద్భుతంగా నిర్మించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, వార్డు పిల్లలకు ఆటలు ఆడుకోవడానికి పార్క్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment