ప్రభుత్వ మోసాలపై ఎండగట్టండి
నియోజకవర్గ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్
సిద్దిపేటజోన్: జనవరి 26 నుంచి అమలు చేయనున్న ఆత్మీయ భరోసా, రైతు భరో సా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంను ఎండగట్టాలని, ప్రతీ ఒక్కరూ గ్రామ సభల్లో పాల్గొని పేద ప్రజల కోసం నిలబడి, అర్హులైన, నిజమైన పేదలకు న్యాయం జరిగేలా చూడాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన నియోజకవర్గ పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలు, పార్టీ కేడర్ అనుసరించే విధానాన్ని గురించి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేసిందని, ఇదే విషయాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, గ్రామ సభల్లో చర్చకు తేవాలని సూచించారు. గ్రామ సభలకు పార్టీ శ్రేణులు వెళ్లి నిజమైన, అర్హులైన పేదలకు, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఆత్మీయ భరోసాను కోతలు లేకుండా అమలు చేయాలని అడగాలని, జిల్లాలో 2 లక్షల ఉపాధి హామీ కూలీలు ఉన్నారని, ప్రభుత్వ నిబంధనలతో 75 వేల మంది కూలీలకు వర్తిస్తుందని, మిగితా కూలీల పరిస్థితి గురించి నిలదీయాలని సూచించారు. ఎకరం లోపు భూమి ఉన్న రైతుకు కూడా పథకం అమలు చేసేలా గ్రామ సభల్లో అడగాలన్నారు. రైతు భరోసాలో ఏరివేతలు లేకుండా, న్యాయంగా ఉండే వారికి, అర్హులైన రైతులకు భరోసా వచ్చేలా చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment