తొగుట(దుబ్బాక): ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బుర్ర వీరస్వామిగౌడ్ (60) కుల వృత్తితోపాటు గ్రామంలో టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగా ఉదయం ఈత వనంలోకి వెళ్లాడు. మోకు బిగించుకొని చెట్టు పైకి ఎక్కుతుండగా మధ్యలో అదుపుతప్పి కిందపడిపోయాడు. తోటి కార్మికులు చికిత్స కోసం సిద్దిపేటకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కమలమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. బాదిత కుటుంబాన్ని ప్రభుత్వం మానవత్వంతో ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
మద్యం మత్తులో పడిపోయి వ్యక్తి
పటాన్‌చెరు టౌన్: మద్యం మత్తులో పడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన సుదర్శన్ గులాబ్ (40) బతుకుదెరువు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి రామరాజు నగర్‌కి వచ్చి ఉంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. భార్య రెండేళ్ల కిందట విడిపోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసై ఎక్కడపడితే అక్కడ తాగి తిరుగుతూ ఉండేవాడు.16న ముత్తంగి హరి దోష సమీపంలో పడిపోయి ఉండటంతో స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా మృతి చెందాడు. మృతుడి పెదనాన్న బన్సీలాల్ గోపీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చెరువులో పడి యువకుడు..
టేక్మాల్(మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలంలోని హసన్‌మహ్మద్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ తుక్కయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన తెరగొర్రి అనిల్ (25) వ్యవసాయంతోపాటు కూలీ పని చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సుంగుపేటకు చెందిన రాధతో నాలుగేళ్ల కిందట వివాహం జరుగగా ఒక కుమారుడు ఉన్నాడు. నెలరోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో రాధ తల్లిగారింటికి వెళ్లింది. 16న సాయంత్రం కాలకృత్యాలకు వెళ్లిన అనిల్ రాత్రి అయినా ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం చెరువు గట్టుపై అనిల్ పర్సు, ఫోన్ ఉండడంతో గ్రామస్తులు చెరువులోకి దిగి వెతకగా మృతదేహం లభ్యమైంది. అనిల్‌కు ఈత రాకపోవడంతో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు మృతుడి తల్లి దుర్గమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చికిత్స పొందుతూ మహిళ..
దుబ్బాకరూరల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని బల్వంతాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజ్ కథనం మేరకు.. సౌడు రాజమణి(48), భర్త పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవించేది. కొద్ది రోజులుగా మద్యానికి బానిసైంది. మద్యం మానేయాలని ఇంట్లో వారు చెప్పిన వినకుండా గొడవ పడేది. 13న మద్యం తాగిన రాజమణి ఇంట్లో గొడవ చేయగా భర్త మందలించి బయటకు వెళ్లాడు. మద్యం మత్తులో గడ్డి మందు తాగి భర్తకు చెప్పింది. వెంటనే ఆమెను 108లో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. భర్త నాంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment