సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జోగిపేట(అందోల్): ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీపీటీఎంఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోగిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుక్రవారం ఆటో డ్రైవర్ల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మంచిరోజులు వస్తాయన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తెలంగాణలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అయ్యాయని, అనేకమంది ఆటో డ్రైవర్లు ఆర్థిక బాధలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు ద్వారా ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు వైద్య సౌకర్యంతో పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించాలని కోరారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా కేటాయించాలన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.15 లక్షల బీమా సౌకర్యం కల్పించేందుకు త్వరలో బీమా శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీఎంఎస్ అనుబంధ తెలంగాణ ఆటో, ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగులయ్య ఆధ్వర్యంలోఈ సభకు తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ప్రతినిధులు యం.డి హాబీబ్, శ్రీధర్‌రెడ్డి బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యదర్శి పి.మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శంకర్, జోగిపేట ఆటో యూనియన్ నాయకులు బాబుల్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
బీపీటీఎంఎం
జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్
Comments
Please login to add a commentAdd a comment