మోడల్ ఇందిరమ్మ ఇళ్లు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. వీటి ఆధారంగా సర్వే చేపట్టి అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా జిల్లాలోని 25 మండల కేంద్రాల్లో నిర్మాణం చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మండల ప్రజాపరిషత్తు కార్యాలయం ఆవరణలో మోడల్ ఇంటి నిర్మాణం పనులకు ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.
అవగాహన కోసమే ఇక్కడ నిర్మాణం...
వివిధ పనులపై నిత్యం మండల కేంద్రానికి ప్రజలు వస్తుంటారు. వారందరికి తెలిసే విధంగా మండల పరిషత్తు కార్యాలయాలను ఎంచుకున్నట్లు సమాచారం. సంగారెడ్డితోపాటు పటాన్‌చెరు మండల కార్యాలయం ఆవరణలో నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి. మిగతా మండల కేంద్రాల్లో స్థలాలను పరిశీలించి, ఎంపిక చేస్తున్నారు. మిగితా వాటికి త్వరలో భూమి పూజ చేయనున్నారు. మోడల్ ఇందిరమ్మ ఇళ్లు 400 చదరపు అడుగుల పరిధిలో నిర్మాణం చేపట్టనున్నారు. హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూమ్‌తోపాటు బెడ్ రూమ్ నిర్మించనున్నారు. ఇంటి నమూనాను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హౌసింగ్ డైరెక్టర్ ఇటీవల విడుదల చేశారు. రెండు నెలల వ్యవధిలో రూ.5లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణంతోపాటు విద్యుత్తు సౌకర్యం కల్పించటంతోపాటు రంగులు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
25 మండలాల్లో నిర్మాణం
ఇప్పటికే రెండుచోట్ల ప్రారంభమైన
ఇళ్ల పనులు
మిగతాచోట్ల భూమి కోసం పరిశీలన
అవగాహన కల్పించేందుకే...
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అందించే రూ.5లక్షలతో మోడల్ ఇందిరమ్మ ఇళ్లు మండల ప్రజాపరిషత్తు కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్నారు. జిల్లాలో 25 మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే సంగారెడ్డితోపాటు పటాన్‌చెరు మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో పనులు కొనసాగుతున్నాయి.
–చలపతిరావు, పీడీ, హౌసింగ్, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment