కొలువే లక్ష్యం కావాలి
● ‘నిరంతరం సాధన చేయాలి ● గ్రంథాలయాలకు మరిన్ని వసతులు కల్పిస్తాం ● కలెక్టర్ మనుచౌదరి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): లక్ష్యం పెట్టుకొని, ప్రణాళికబద్దంగా చదివినప్పుడే అనుకున్న ఉద్యోగం సాధించే అవకాశం ఉందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం జిల్లా గ్రంథాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ మనుచౌదరి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో రాణిస్తున్న విజేతలను, మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యుత్ సౌకర్యం లేకున్నా కేవలం వీధి లైట్ల కింద చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న మహనీయులు ఎందరో ఉన్నారన్నారు. రోజుకు 8గంటల పాటు చదివితే ఉద్యోగం సాధించడం సులువేనన్నారు. సివిల్ పరీక్షల కోసం స్వతహాగా రెండేళ్లు చదువుకొని జాతీయ స్థాయిలో 36వ ర్యాంక్ సాధించానన్నారు. కోచింగ్ సెంటర్లలో కేవలం రివిజన్ స్థాయికి మాత్రమే పనికివచ్చే విధంగా బోధిస్తారన్నారు. లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎపుడైనా నా వద్దకు వస్తే, పరీక్షలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తానన్నారు. నెలకొకసారి గ్రంథాలయానికి వచ్చి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో మాట్లాడుతానని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను పోటీ పరీక్షల అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. దుబ్బాక, మిరుదొడ్డి, తదితర ప్రాంతాల నుంచి నిరుద్యోగులు జిల్లా గ్రంథాలయానికి రోజు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రంథాలయాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తే వారికి మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సభ్యులు, ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment