కొనుగోళ్లు వేగిరం చేయండి
● దళారులకు అమ్మి మోసపోతున్న రైతులు ● మాజీ మంత్రి హరీశ్‌రావు
నంగునూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దన్నపేట మార్కెట్ యార్డును సందర్శించి వడ్ల కొనుగోలుపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ హామీలను గాలికి వదిలేసి తెలంగాణను మాత్రం తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. కొనగోళ్లు చేయని అధికారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోని సీఎం.. మద్యం అమ్మడంలేదని ఎకై ్సజ్ కమిషనర్‌ను బదిలీ చేయడంతో పాటు 30 మంది సూపరింటెండెంట్లు, పలువురు సీఐలకు చార్జ్ మెమోలు ఇచ్చారన్నారు. తెలంగాణలో వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం బోగస్ మాటలు చెబుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడా సన్న ధాన్యం కొనలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనకపోవడంతో దళారులకు ధాన్యం అమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగిత్యాల, నల్లగొండ జిల్లాలో రైతు ధర్నాకు వెళితే పత్తి, వడ్లు కొనేవారే కరువయ్యారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రైతు సమస్యలు పక్కన పెట్టి మూసీ నది సుందరీకరణ పేరుతో, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రులు గాలి మోటర్‌లో తిరగడం బందు చేసి నేల మీదికి రావాలని, రైతులు తిరగబడక ముందే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment