సర్వేను బహిష్కరించిన గౌరవెల్లి నిర్వాసితులు
పూర్తిస్థాయిలో పరిహారం రాలేదంటూ నిరసన
అక్కన్నపేట(హుస్నాబాద్): తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాలేదంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు కులగణన సర్వేను బహిష్కరించి నిరసన తెలిపారు. అక్కన్నపేట మండలం కపూర్నాయక్తండా గ్రామ పరిధిలో దాదాపు 60 కుటుంబాల భూ నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకొని ‘శ్రీరామ్తండా’అనే పేరుతో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం కులగణన సర్వే చేసేందుకు ఎన్యుమరేటర్లు తండాకు వెళ్లారు. సర్వేలో తాము పాల్గొనేదిలేదంటూ బహిష్కరించి, ఎన్యుమరేటర్లను వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా పలువురు భూ నిర్వాసితులు మాట్లాడుతూ ఇప్పటికీ ఇళ్ల స్థలాలకు, భూములకు సంబంధించి పరిహారం రావల్సి ఉందన్నారు. పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారే తప్ప మాకు చెల్లించలేదన్నారు. పెండింగ్లో ఉన్న పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సర్వేలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment