ఎక్కడికక్కడ పోలీసుల కట్టడి
కస్టోడియన్ భూముల వద్దకు వెళ్లకుండా అడ్డగింత
శివ్వంపేట(నర్సాపూర్)/నర్సాపూర్ రూరల్: కస్టోడియన్ భూములు చదును చేసుకునేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ మధిర గ్రామమైన లక్ష్మాపూర్ శివారులో సుమారు 1,000 ఎకరాల పైచిలుకు కస్టోడియన్ భూములను సీపీఐ ఆధ్వర్యంలో వారం రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు చదును చేస్తున్నారు. అందులోని పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించి హద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా కస్టోడియన్ భూముల్లోకి వెళ్తుండడంతో గురువారం పోలీసులు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి లక్ష్మాపూర్ వైపునకు వెళ్తున్న వారిని శివ్వంపేట మండలం చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో అడ్డుకున్నారు. కొందరు వినకపోడంతో అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. భూములను చదును చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల చెందిన పలువురు గొడ్లళ్లు, కొడవళ్లతో రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా భూములను చదును చేసిన రైతులను గుమ్మడిదల పోలీసులు గురువారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచుకొని చీకటి పడిన తర్వాత డీసీఎంలో నర్సాపూర్ పట్టణంలో వదిలివెళ్లారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చేతిలో చిల్లి గవ్వ లేదని బస్సుల్లో, ఆటల్లో తిరుగుకుంటూ గుమ్మడిదల మండలంలోని తమ గ్రామాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment