WC 2023: ఐసీసీ కీలక నిర్ణయం.. టీమిండియాకు ఎదురుదెబ్బ! | ICC advises ground curators to prepare sporting wickets to subdue home advantage in World Cup - Sakshi
Sakshi News home page

WC 2023: ఈసారి అలా కావొద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం.. టీమిండియాకు ఎదురుదెబ్బ!

Published Thu, Aug 24 2023 3:51 PM | Last Updated on Tue, Oct 3 2023 7:07 PM

ICC Advice Curators To Prepare Sporting Wickets Subdue Home Advantage WC Report - Sakshi

ICC ODI World Cup 2023: పుష్కరకాలం తర్వాత భారత్‌ ఐసీసీ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం విదితమే. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు పది వేదికల్లో వన్డే వరల్డ్‌కప్‌-2023 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై టీమిండియా మరోసారి అదరగొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.

అప్పుడు ధోని సేన
వరల్డ్‌కప్‌-2011 గెలిచిన ధోని సేన తరహాలోనే రోహిత్‌ శర్మ బృందం కూడా ట్రోఫీని ముద్దాడుతుందనే నమ్మకంతో ఉన్నారు. కాగా పటిష్ట టీమిండియాకు సొంతగడ్డపై ఆడటం టీమిండియాకు సానుకూలాంశం.. అదనపు బలం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్పిన్నర్లకు అనుకూలం.. అలా వద్దు
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ జరిగే వేదికల్లో మ్యాచ్‌ పోటాపోటీగా సాగేలా స్పోర్టింగ్‌ పిచ్‌లను రూపొందించాలని క్యూరేటర్లను ఆదేశించినట్లు సమాచారం. కాగా ఉపఖండ పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఐసీసీ హెడ్‌ క్యూరేటర్‌ ఆండీ అట్కిన్సన్‌ మెగా ఈవెంట్‌లో ఆతిథ్య జట్టుకు హోం అడ్వాంటేజ్‌ లేకుండా పిచ్‌లు తయారు చేయాల్సిన బాధ్యత క్యూరేటర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఫ్లాట్‌ ట్రాకులు కాకుండా.. స్పోర్టింగ్‌ వికెట్‌ రూపొందించాలని సూచించినట్లు సమాచారం.

గత మూడుసార్లూ వాళ్లే విజేతలు
ఈ మేరకు ముంబైలో జరిగిన సమావేశంలో అట్కిన్సన్‌ క్యూరేటర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వార్మప్‌ మ్యాచ్‌లు కూడా కాంపిటేటివ్‌గా ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. గత మూడు పర్యాయాల్లో ఆతిథ్య జట్లే వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే.

2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కలిసి భారత్‌ సంయుక్తంగా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చి విజేతగా నిలిచింది. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిసి హోస్ట్‌గా ఉండి ట్రోఫీని ముద్దాడింది. ఇక 2019లో ఇంగ్లండ్‌ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్య దేశంగా ఉండి మొట్ట మొదటిసారి జగజ్జేతగా నిలిచింది.

హోం అడ్వాంటేజ్‌ ఉండొద్దు
ఈ నేపథ్యంలోనే ఐసీసీ.. ఆతిథ్య జట్టుకు ఏకపక్ష ప్రయోజనాలు చేకూరకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆండీ అట్కిన్సన్‌ నిర్వహించిన సమావేశానికి హాజరైన బీసీసీఐ వర్గాలు.. టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ హోం అడ్వాంటేజ్‌ లేకుండా చూసుకోవాలని చెప్పినట్లు తెలిపాయి. 

స్పోర్టింగ్‌ పిచ్‌లే కావాలి
ఆయా ప్రదేశాల్లో మట్టి స్వభావాన్ని బట్టి పిచ్‌ పరిస్థితులు మారతాయని, అయితే అట్కిన్సన్‌ మాత్రం అన్నిచోట్లా స్పోర్టింగ్‌ పిచ్‌లే ఉండాలని పట్టుబట్టినట్లు పేర్కొన్నాయి. కాగా 2023 బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో భారత పిచ్‌లపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అదే విధంగా లక్నోలో న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌తో పాటు 2023 ఆరంభంలో వన్డే మ్యాచ్‌లలోనూ భారీ స్కోర్లు నమోదు కావడం విమర్శలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. 


PC: ICC

చదవండి: Asia Cup: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. తిలక్‌ వర్మ అరంగేట్రం ఫిక్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement