పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2025) జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్‌పై లీకుల వెలువడ్డాయి. ఈ మెగా టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో భారత్.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో తలపడనున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 20, 23, మార్చి 1 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు సమాచారం. ఈ మూడు మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తుంది.
అయితే పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ షెడ్యూల్ నిజమా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్‌ల వేదికను పాక్‌లో కాకుండా ఇతర దేశంలో నిర్వహించాలని భారత ప్రభుత్వం ఐసీసీని కోరవచ్చు. భద్రతా కారణాల రిత్యా భారత్ వేదికలు మార్చాలని కోరితే ఐసీసీ కూడా ఓకే చెప్పవచ్చు.
గతంలో ఆసియా కప్‌లో భారత్.. పాక్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాగే భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండటంతో భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశాన్ని పరిశీలించలేదు. ఒకవేళ ఐసీసీ ఈ అంశాన్ని తేల్చాలని బీసీసీఐని కోరితే అతి త్వరలో క్లారిటీ రావచ్చు.
వేదిక విషయం అటుంచితే.. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే భారత్, పాకిస్తాన్ ఉండటం ఖాయమైపోయింది. మార్చి 1న ఈ దాయాదుల సమరం జరిగే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19-మార్చి 9 మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, భారత్ ఈ మధ్యలో చాలా క్రికెట్ ఆడనుంది. ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. ఆతర్వాత శ్రీలంక పర్యటనకు.. ఆతర్వాత బంగ్లాదేశ్ భారత పర్యటనకు.. నవంబర్‌లో భారత్.. సౌతాఫ్రికా పర్యటన.. ఆతర్వాత డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన.. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ భారత పర్యటన.. ఇలా ఈ మధ్యలో టీమిండియా చాలా బిజీగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment