పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయిపై కనీస లాభం సంపాదించడమే వ్యాపారం... ముంబైలో అంబానీ అయినా ఊర్లో కిరాణా కొట్టు నడిపే వ్యక్తి అయినా ఈ విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. మరి ఐపీఎల్‌లో ప్రసారహక్కుల కోసం వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన సంస్థలు ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ఉంటాయి? ఐదేళ్ల కాలానికిగాను వారు చెల్లించబోయే మొత్తానికి ‘గిట్టుబాటు’ అవుతుందా! ప్రసార హక్కుల కోసమే మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐపీఎల్ ఎలా ఉండబోతోంది? కేవలం వ్యాపార ప్రకటనలతోనే తమ పెట్టుబడితో పాటు లాభాలను తీసుకోవడం ఈ సంస్థలకు సాధ్యమేనా! ఇంకా చెప్పాలంటే ఈ భారీ మొత్తం వల్ల ఐపీఎల్‌లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరం!
రూ. 118.02 కోట్లు... టీవీ, డిజిటల్ విభాగాలు కలిపి చూస్తే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రసారకర్తలు చెల్లించబోయే మొత్తం ఇది. ఇంకా వివరంగా చెప్పాలంటే 410 మ్యాచ్‌లలో మ్యాచ్‌కు 40 ఓవర్ల చొప్పున (ఎక్స్‌ట్రా బంతులు కాకుండా) 98,400 బంతులు... అంటే ఒక్కో బంతి విలువ అక్షరాలా 50 లక్షలు! టీవీలో అయితే ‘స్టార్’ సంస్థ ప్రతీ మ్యాచ్‌కు కనీసం రూ. 57.5 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ‘వయాకామ్–18’ కంపెనీ ప్రతీ మ్యాచ్‌కు రూ. 50 కోట్ల కేవలం ప్రసార హక్కులకు మాత్రమే బీసీసీఐకి చెల్లించబోతోంది.
దీనికి అదనంగా ఆయా సంస్థలకు బోలెడు ఖర్చులు! మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం కెమెరాలు, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు, కామెంటేటర్లు, ఉద్యోగులకు చెల్లింపులు, ఇతర సాధారణ ఖర్చులకు సొంత డబ్బు వాడాల్సిందే. ఇలాంటి స్థితిలో ఒక్కో మ్యాచ్‌కు వారు ఆశించే మొత్తం తిరిగి రావడం సాధ్యమేనా! ప్రసారకర్తల కోసం ఐపీఎల్ వీక్షణంలో కూడా పలు మార్పులకు బీసీసీఐ అంగీకరించవచ్చు.
ప్రకటనలే ప్రధానం...
ఇన్నింగ్స్‌కు 2 చొప్పున ‘స్ట్రాటజిక్ బ్రేక్’లతో పాటు ఓవర్ల మధ్యలో విరామ సమయం తదితరాలు కలిపి ప్రస్తుతం ప్రకటనల కోసం గరిష్టంగా ఒక టి20 మ్యాచ్‌లో 2,400 సెకన్లు (40 నిమిషాలు) అందుబాటులో ఉన్నాయి. 2022 ఐపీఎల్ మ్యాచ్‌లకు 10 సెకన్ల ప్రకటనకు సుమారు రూ.15 లక్షల వరకు ‘స్టార్’ వసూలు చేసింది. దీంతో పాటు ‘కో ప్రజెంటర్’ పేరుతో గరిష్టంగా ఒక్కో వ్యాపార సంస్థ నుంచి రూ. 180 కోట్ల వరకు... అసోసియేట్ స్పాన్సర్ ద్వారా గరిష్టంగా రూ. 105 కోట్ల వరకు తీసుకుంది.
ఇతర అనుబంధ అంశాలు (ఫోర్లు, సిక్స్‌లు, ఫాస్టెస్ట్ బాల్) తదితరాల ద్వారా మరో రూ. 300 కోట్లు, హైలైట్స్ ప్యాకేజీల ద్వారా రూ. 200 కోట్ల వరకు అదనంగా ‘స్టార్’ ఖాతాలో చేరాయి. ఇది ఐపీఎల్ ప్రకటనలకు సంబంధించి తాజా పరిస్థితి. సాధారణంగా ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రకటనల రేటు సుమారు 10–15 శాతం పెరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం చూస్తే ఇది సరిపోదు. కనీసం 80 శాతం వరకు రేటు పెంచాల్సి ఉంటుంది. ఇది అంత సులు వేమీ కాదు.
లీగ్‌పై ఎంత క్రేజ్ ఉన్నా... ప్రకటన దారులు అంత సులువుగా ముందుకొస్తారా అనేది ప్రశ్న. ఈ ఏడాదితో పోలిస్తే మున్ముందు మ్యాచ్‌ల సంఖ్య పెరగడం సానుకూలాంశం కాగా... అభిమానులు రెండున్నర నెలలు సుదీర్ఘంగా సాగే లీగ్‌పై ఒకే స్థాయిలో ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే. 2022లోనే వ్యూయర్‌షిప్ 30 శాతం తగ్గినా... దాని ప్రభావం తాజా వేలంపై పడలేదు కాబట్టి సమస్య గా అనిపించలేదు. కానీ మున్ముందు చెప్పలేం. అయితే అన్ని లెక్కలు చూసుకున్నాకే పెద్ద సంస్థలు హక్కుల కోసం బరిలోకి దిగి ఉంటాయి. కాబట్టి బయటకు కనిపించని లెక్కలూ ఉండవచ్చు!
ఇలా కూడా జరగొచ్చు...
ఇంత భారీ మొత్తానికి హక్కులు అమ్మిన తర్వాత రాబోయే సీజన్లలో ప్రసారకర్తల భిన్న డిమాండ్లను బోర్డు సహజంగానే గౌరవించాల్సి రావచ్చు. ‘స్ట్రాటజిక్ టైమౌట్’లను 5 ఓవర్లకు ఒక్కోసారి చొప్పున మ్యాచ్‌కు ఆరు వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లో ఎక్కడ వీలైతే అక్కడ ప్రకటనలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సహజంగానే మ్యాచ్ వ్యవధి కూడా పెరగడం ఖాయం.
కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే ప్రకటనల మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సి రావచ్చు! డిజిటల్ కోసం భారీ మొత్తం చెల్లించిన ‘రిలయన్స్’ ఐపీఎల్ కోసం ఎక్కువ మొత్తంతో ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసే అవకాశమూ ఉంది. ఈ భారీ ఒప్పంద ప్రభావం పడే కీలక అంశాన్ని చూస్తే ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్‌లకు మంగళం పలికినట్లే! ఐపీఎల్ ప్రభావం, దానితో ముడిపడి ఉన్న డబ్బు, ఐసీసీని శాసించగలిగే బీసీసీఐని చూస్తే ప్రపంచకప్‌లో మినహా ఇతర అంతర్జాతీయ టి20లు కనిపించకపోవచ్చు. అన్నింటికి మించి ఫాంటసీ లీగ్‌లు, క్రికెట్ బెట్టింగ్ మరింతగా విజృంభించడం ఖాయం!
సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment