మార్క్‌రమ్, పూరన్, ఉమ్రాన్
ముంబై: ప్రత్యేకించి టి20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో క్రీజులో టెయిలెండర్లు ఉన్నా కనీసం 10 పరుగులైనా చేస్తారు. చేతిలో నాలుగో ఐదో వికెట్లు ఉంటే ఆ దంచుడు వేరుగా ఉంటుంది. కానీ పంజాబ్ కింగ్స్ చేతిలో ఉన్న నాలుగు వికెట్లు కోల్పోయిందే తప్ప ఒక్కటంటే ఒక్క పరుగైనా చేయలేదు. అలాగని ఆ ఓవర్ వేసింది అరివీర పేస్ బౌలర్ కాదు. 22 ఏళ్ల కశ్మీరి అన్‌క్యాప్డ్ సీమర్ ఉమ్రాన్ మాలిక్.
ఆరు బంతుల్లో 0, స్మిత్, 0, రాహుల్ చహర్, వైభవ్, రనౌట్ (అర్శ్‌దీప్)... ఇలా అతని సంచలన బౌలింగ్‌కు 3 వికెట్లు, రనౌట్‌తో కలిపి 4 వికెట్లు రాలాయి. అంతకంటే ముందు బంతికి (19వ ఓవర్ ఆఖరి బాల్) లివింగ్‌స్టోన్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో కేవలం 7 బంతుల వ్యవధిలో సగం (5) వికెట్లను కోల్పోయిన పంజాబ్ భారీ స్కోరుకు దూరమైంది. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా నాలుగో విజయంతో విన్‌రైజర్స్ అయింది.
ఆదివారం జరిగిన ఈ పోరులో మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. లివింగ్‌స్టోన్ (33 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమ్రాన్ (4/28), భువనేశ్వర్ (3/22) తమ పేస్ ప్రతాపం చూపించారు. తర్వాత సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి గెలిచింది. మార్క్‌రమ్ (27 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
లివింగ్‘స్ట్రోక్స్’
పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంకాగా... శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. ఇన్నింగ్స్ విషయానికొస్తే లివింగ్‌స్టోన్ మార్క్ ఈ సీజన్‌లో కొనసాగుతోంది. పవర్‌ప్లే ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతను 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఉమ్రాన్ ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సాగాడు. 26 బంతుల్లో లీగ్‌లో అతను మూడో ఫిఫ్టీ సాధించాడు. శిఖర్ (8), ప్రభ్‌సిమ్రాన్ (14), బెయిర్‌స్టో (12), జితేశ్ (11), ఒడియన్ స్మిత్ (13), షారుఖ్ (26) ఇలా అందరూ అత్తెసరు స్కోరు చేసినా పంజాబ్ 150 పైచిలుకు పరుగులకు లివింగ్‌స్టోన్ బ్యాటింగే కారణం!
నడిపించిన మార్క్‌రమ్
ఛేజింగ్‌లో హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) తక్కువ స్కోరుకే అవుటవడం, ఇన్నింగ్స్ చప్పగా సాగడంతో హైదరాబాద్ మొదట్లో కష్టపడింది. అభిషేక్ శర్మ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) కాస్త బ్యాట్‌కు పనిచెప్పడంతో లక్ష్యంవైపు సాగింది. అనంతరం మార్క్‌రమ్, పూరన్ గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 75 పరుగులు జోడించారు. మార్క్‌రమ్ మ్యాచ్‌ను ఆఖరిదాకా లాక్కు రాలేదు. 19 ఓవర్లో వరుసగా 4, 6తో ఇంకో ఏడు బంతులు మిగిలుండగానే ముగించేశాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 8; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) పూరన్ (బి) నటరాజన్ 14; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) సుచిత్ 12; లివింగ్‌స్టోన్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 60; జితేశ్ శర్మ (సి అండ్ బి) ఉమ్రాన్ మాలిక్ 11; షారుఖ్ ఖాన్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 26; ఒడియన్ స్మిత్ (సి అండ్ బి) ఉమ్రాన్ మాలిక్ 13; రబడ (నాటౌట్) 0; రాహుల్ చహర్ (బి) ఉమ్రాన్ మాలిక్ 0; వైభవ్ అరోరా (బి) ఉమ్రాన్ మాలిక్ 0; అర్శ్‌దీప్ సింగ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 151. వికెట్ల పతనం: 1–10, 2–33, 3–48, 4–61, 5–132, 6–151, 7–151, 8–151, 9–151, 10–151.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–22–3, మార్కో జాన్సెన్ 4–0–35–0, నటరాజన్ 4–0–38–1, సుచిత్ 4–0–28–1, ఉమ్రాన్ మాలిక్ 4–1–28–4.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) షారుఖ్ ఖాన్ (బి) రాహుల్ చహర్ 31; విలియమ్సన్ (సి) ధావన్ (బి) రబడ 3; రాహుల్ త్రిపాఠి (సి) షారుఖ్ ఖాన్ (బి) రాహుల్ చహర్ 34; మార్క్‌రమ్ (నాటౌట్) 41; నికోలస్ పూరన్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.5 ఓవర్లలో మూడు వికెట్లకు) 152.
వికెట్ల పతనం: 1–14, 2–62, 3–77.
బౌలింగ్: వైభవ్ అరోరా 3.5–0–35–0, రబడ 4–0–29–1, అర్శ్‌దీప్ సింగ్ 4–0–32–0, రాహుల్ చహర్ 4–0–28–2, ఒడియన్ స్మిత్ 1–0–8–0, లివింగ్‌స్టోన్ 2–0–19–0.
Comments
Please login to add a commentAdd a comment