సెలవు పెట్టకుండా విహారయాత్రకు..
● సీడీపీఓ, 30 మంది ఐసీడీఎస్ సిబ్బంది నిర్వాకం
ఉలవపాడు: అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సీడీపీఓతో సహా సెలవు పెట్టకుండా విహారయాత్రకు వెళ్లారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. సాధారణంగా ఎవరైనా విధులకు హాజరు కాకుండా ఉండాలంటే ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలి. కానీ అలాంటిదేమీ లేదు. ఏకంగా ఉలవపాడు ప్రాజెక్ట్ సీడీపీఓ అరుణ తన ఉన్నతాధికారులకు చెప్పకుండానే జిల్లా దాటి మరో జిల్లాకు విహారయాత్రకు వెళ్లారు. ఇంకా సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు 30 మంది వరకు భైరవకోనకు వెళ్లారు. ఆయా కేంద్రాల్లో సెలవు చీటీ మాత్రం పెట్టి రిజిస్టర్‌లో నమోదు చేయలేదు. పరిస్థితిని బట్టి హాజరు వేసుకుందామని అనుకున్నారో.. ఏమో కానీ సూపర్‌వైజర్లు, కార్యకర్తల మధ్య విభేదాలు ఉండడంతో విషయం బయటకు పొక్కింది. కానీ సీడీపీఓ మాత్రం పీడీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్‌ను వివరణ కోరగా ఉలవపాడు సీడీపీఓ సెలవు పెట్టలేదని.. విహారయాత్రకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు.
29 నుంచి
బిజినెస్ ఎక్స్‌పో
నెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో ఏపీ చాంబర్ బిజినెస్ ఎక్స్‌పో–2024 జరుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒమ్మిన సతీష్ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్స్‌పో ఆరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో కొండా శేఖర్‌రెడ్డి, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
అల్లూరు: గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. అల్లూరు ఎస్సై కిశోర్‌బాబు మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 20వ తేదీ సాయంత్రం అల్లూరు వాటర్‌ట్యాంక్ సెంటర్‌లో సుమారు 70 సంవత్సరాల వయసున్న వృద్ధుడు అపస్మారకస్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. అల్లూరుపేట వీఆర్వో మనోహర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96327 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
రూ.3.6 లక్షల విలువైన ఫైబర్ కేబుల్ చోరీ
ఆత్మకూరు: మండలంలోని వెన్నవాడ గ్రామంలో ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించిన కేబుల్ చోరీకి గురైంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సిన రూ.3.6 లక్షల విలువైన కేబుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు సంబంధిత కంపెనీ ఇంజినీర్ అశోక్ ఆత్మకూరు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సీఐ జి.గంగాధర్, ఎస్సై ఎస్‌కే జిలానీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
మద్యం బాటిళ్ల స్వాధీనం
జలదంకి: మండలంలోని చామదలలో వేములపాటి తిరుపాలయ్య అనధికారికంగా 13 మద్యం బాటిళ్లు కలిగి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎౖక్సైజ్ సీఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అతను గ్రామంలో మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఎ కై ్సజ్ ఎస్సై దేవిక, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment