జామాయిల్ పెంపకంతో వీఎస్‌ఎస్‌లకు ఆదాయం
● సీఎఫ్ కాశీ విశ్వనాథరాజు
నెల్లూరు(అర్బన్): అటవీ భూముల్లో జామాయిల్ పెంపకం ద్వారా వనసంరక్షణ సమితులకు ఆదాయం లభించి అందులోని సభ్యులకు ఉపాధి దొరుకుతుందని గుంటూరు నుంచి వచ్చిన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి (సీఎఫ్) కాశీ విశ్వనాథరాజు తెలిపారు. జిల్లాలోని వనసంరక్షణ సమితుల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, అటవీ శాఖ రేంజర్లు, అధికారులతో నెల్లూరు వేదాయపాళెంలోని ఎంవీఎస్ కల్యాణ మండపంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎఫ్ మాట్లాడుతూ పెరిగిన జామాయిల్ చెట్లను కట్ చేసి విక్రయించడం ద్వారా గత 20 ఏళ్లలో లేని విధంగా ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో సగభాగం ఫారెస్ట్ శాఖ తీసుకుని మిగతా నగదును వీఎస్‌ఎస్‌లకు అందిస్తున్నామన్నారు. దానిని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో టెండర్ ద్వారా జామాయిల్ చెట్లను దక్కించుకున్న సంస్థ మార్చి నెలలోగా కటింగ్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే కటింగ్ చేసిన ప్రాంతాల్లో 375 వీఎస్‌ఎస్‌ల ద్వారా జామాయిల్ మొక్కలను నాటుతున్నామన్నారు. పలు అటవీ గ్రామాలకు చెందిన వీఎస్‌ఎస్ చైర్‌పర్సన్లు మాట్లాడుతూ తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని కట్ చేసి బీమా సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. చెట్ల ఎన్యుమరేషన్‌కు సంబంధించిన పాత బకాయిలను చెల్లించాలని, వీఎస్‌ఎస్‌ల ద్వారా లభించే ఆదాయాన్ని వ్యక్తిగతంగా వాడుకునేందుకు కొంత మొత్తాన్ని ఇవ్వాలని కోరారు. జిల్లా ఫారెస్ట్ అధికారి మహబూబ్‌బాషా మాట్లాడారు. కార్యక్రమంలో గుంటూరు స్క్వాడ్ డీఎఫ్‌ఓ మారుతీప్రసాద్, నెల్లూరు రేంజర్ మాల్యాద్రి, రాపూరు రేంజర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment