వర్షం కురిస్తే నరకమే..
సండే మార్కెట్‌లో నీట మునిగిన రోడ్డు
నెల్లూరు సిటీ: వర్షం కురిస్తే చాలు.. నెల్లూరులోని ప్రధాన రహదారులు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. మోకాలిలోతులో నీరు నిలిచిపోతుండడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ గుంత ఉందో తెలియక భయపడుతూ తిరిగాల్సి వస్తోంది. వర్షపునీరు, డ్రెయినేజీ కలిసిపోయి రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితులున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి నెల్లూరులో ఎడతెరపి లేకుండా వాన పడుతోంది. దీంతో ప్రజల రోజూవారీ పనులకు ఆటంకం ఏర్పడింది. కేవీఆర్, పొగతోట, సండే మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఖాళీ ప్రదేశాలు చెరువులను తలపిస్తున్నాయి. రామలింగాపురం, మాగుంటలేవుట్, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా అధికారులు ప్రస్తుతానికి చర్యలు తీసుకున్నారు. రూరల్ పరిధిలోని పొట్టేపాళెం, సౌత్‌మోపూరు, కలివేలపాళెం, నారాయణరెడ్డిపేట, అల్లీపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికే పొగమంచు దట్టంగా కమ్మేసింది. మరోవైపు చిరుజల్లుల కారణంగా జాతీయ రహదారిపై తిరిగే వారు ఇబ్బందులు పడ్డారు. పగలే లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఇంకా వానలు కురుస్తాయని అధికారులు చెబుతుండడంతో లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
నెల్లూరులో రోడ్లు జలమయం ప్రజలకు అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment