నెల్లూరు(క్రైమ్): దంపతులిద్దరూ మనుమరాలి శుభకార్యంలో పాల్గొని మోటార్‌బైక్‌పై ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా గుర్తుతెలియని వాహనం ఢీకొని వివాహిత మృతిచెందింది. కళ్లెదుటే భార్య చనిపోవడాన్ని చూసిన భర్త కన్నీరుమున్నీరుగా రోదించాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన షేక్ జైనుల్లా, మస్తానమ్మ (60) దంపతులకు కొడుకు, కుమార్తె సంతానం. ప్రస్తుతం వారు ఉపాధి నిమిత్తం సౌదీలో ఉంటున్నారు. జైనుల్లా, మస్తానమ్మలు ఇంటి వద్ద చిల్లర దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి దంపతులిద్దరూ వెంకటాచలం మండలం గురివిందపూడి గ్రామంలో జరిగిన మనుమరాలి శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. బంధువులతో ఆనందంగా గడిపారు. అర్ధరాత్రి బైక్‌పై జాతీయ రహదారి మీదుగా భగత్‌సింగ్‌కాలనీకి బయలుదేరారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలోకి మితిమీరిన వేగంతో గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో దంపతులు రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ పరారయ్యే క్రమంలో మస్తానమ్మ మీదకు వాహనాన్ని ఎక్కించాడు. ఆమె తలపగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న జైనుల్లా కొద్దిసేపటికి తేరుకుని విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. శుక్రవారం జైనుల్లా ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్సై బలరామిరెడ్డి కేసు నమోదు చేశారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
భర్త కళ్లెదుటే ఘటన
Comments
Please login to add a commentAdd a comment