మంత్రి క్యాంపు ఆఫీసులో డిష్యుం.. డిష్యుం
● టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మాల్యాద్రి అనే టీడీపీ నాయకుడికి, అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తికి మొదలైన వాదన చినికి చినికి గాలివానైట్లు తీవ్ర గొడవలకు దారి తీసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నం చేస్తుండగా మంత్రి ఓఎస్‌డీగా ఉన్న వెంకటేశ్వరరావుపై కొందరు టీడీపీ నాయకులు దుర్భాషలాడుతూ దాడిచేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మా డివిజన్‌లో అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదు. కొత్తగా వచ్చిన కొందరు మాపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఓఎస్‌డీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఏమీ చేయకుండా, మధ్యలో వచ్చిన వారికి పెత్తనం ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మంత్రి తీరుపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
విద్య, వసతిదీవెన
విడుదల చేయాలి
నెల్లూరు (టౌన్): పెండింగ్‌లో ఉన్న విద్య, వసతి దీవెన పథకాల నిధులను వెంటనే ఇవ్వాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ షరీఫ్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక హరనాథపురం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన రూ.2,100 కోట్లు, వసతిదీవెన రూ.1,480 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. జీఓ 77ను రద్దు చేయాలన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్, తౌసీఫ్, మౌళి, సోహెల్, దాస్ పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ కమిటీలకు
ఎన్నికలు నేడు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సాగునీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా ప్రాజెక్ట్ కమిటీల ఎన్నిక శనివారం నిర్వహించనున్నారు. జిల్లాలో ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. సోమశిల, పెన్నార్‌డెల్టా, కనుపూరు కాలువ, గండిపాళెం, రాళ్లపాడు, వీఆర్ కోట ఆనకట్ట సిస్టం ప్రాజెక్ట్‌లకు కమిటీల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో ఐదు ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేశామని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, సాగునీటి సంఘాల ఎన్నికల జిల్లా నోడల్ అధికారి దేశ్‌నాయక్ వివరించారు.
ఎన్నికలు జరిగే ప్రదేశాలు
● సోమశిల ప్రాజెక్ట్ ఎన్నిక నెల్లూరు దర్గామిట్టలోని సోమశిల సర్కిల్ కార్యాలయం
● పెన్నార్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక నెల్లూరు రామలింగాపురంలోని ఇరిగేషన్ కార్యాలయం
● కనుపూరు కాలువ ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక నెల్లూరు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఎంపీడీఓ కార్యాలయం
● గండిపాళెం ప్రాజెక్ట్ ఎన్నిక గండిపాళెం
● రాళ్లపాడు, వీఆర్ కోట ఆనకట్ట సిస్టం ప్రాజెక్ట్‌ల కమిటీ ఎన్నికలు కందుకూరు
కారుణ్య నియామక
ఉత్తర్వులు అందజేత
నెల్లూరు(అర్బన్): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబ వారసులు ఏడుగురికి శుక్రవారం కారుణ్యనియమాక ఉత్తర్వులు కలెక్టరేట్‌లో అందజేశారు. ఆరుగురికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించారు. కె.శిరీషాకు పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగావకాశాన్ని కల్పించారు. ఎస్.జయకృష్ణ, రజనీలకు గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శిగా, పి.సూర్యప్రకాష్‌కు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా, ఏపీఎస్‌కే ప్రణీత్‌కు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా, శ్రీతేజ్, సీహెచ్ హరితకు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి (ఏఓ) తుమ్మా విజయ్‌కుమార్ వీరికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి ప్రజలకు మంచి సేవలందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment