కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లిలో టీడీపీ నేతలు బరితెగించి సహజ వనరులను దోచుకుంటున్నారు. షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఓ నేత చేస్తున్న గ్రావెల్ దందా మితిమీరింది. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై టీడీపీ నేతలే రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాహనాలను పట్టుకున్న పోలీసులను బెదిరించి వదిలించుకుని వెళ్లారు. అడ్డుకున్న వీఆర్వోను గంటల వ్యవధిలోనే బదిలీ చేయించారు. టీడీపీ నేతలు సాగిస్తున్న దందాపై సాక్షాత్తు ఓ టీడీపీ నేత జీ మెయిల్ ద్వారా నారా లోకేశ్‌కు.. అక్రమ మైనింగ్ చేస్తున్న ఫొటోను అటాచ్ చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల అక్రమ నేతల మైనింగ్ తమ్ముళ్ల మధ్య రేగిన చిచ్చు.. ఆ పార్టీ నేతలు సాగిస్తున్న గ్రావెల్ దందాకు అద్దం పడుతోంది. వెంకటాచలం మండలం సర్వేపల్లిలో గ్రావెల్ తవ్వకాలపై చాలా కాలంగా టీడీపీ నేతల మధ్య అత్యర్యుద్ధం జరుగుతోంది. సర్వేపల్లి షాడో ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడు అండతో స్థానికంగా ఉండే ఓ నేత మిగతా నేతలకు అవకాశం లేకుండా గ్రావెల్ తవ్వకాల దందా సాగిస్తున్నాడు. స్థానికంగా గ్రావెల్ మైనింగ్‌ను అడ్డుకున్న వీఆర్వోను ఇక్కడి నుంచి గంటల వ్యవధిలో బదిలీ చేయించడాన్ని కూడా ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు
వెంకటాచలం మండలంలోని సర్వేపల్లిలో ఎస్టీలకు చెందిన భూముల్లో సోమవారం రాత్రి నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు కొందరు మంగళవారం రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. వీఆర్వో మునిబాబు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ తవ్వకాలను అడ్డుకుని టిప్పర్లను వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రావెల్ దందాకు అన్నీ తానై చేస్తున్న టీడీపీ నేత పోలీసులతో మాట్లాడి ఆ వాహనాలను వెంటనే వెనక్కి పంపించేశాడు. దీంతో స్థానిక టీడీపీ నాయకులకు, పోలీసులకు వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను పోలీసులు మార్గమధ్యంలోనే వదిలేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
మండిపడుతున్న టీడీపీ నేతలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో గ్రావెల్ దందాను అన్నీ తానై సాగిస్తున్న టీడీపీ నేత తీరుపై స్థానిక టీడీపీ నాయకులు మండి పడుతున్నారు. గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న వీఆర్వో మునిబాబును వెంటనే సర్వేపల్లిలో లేకుండా గంటల వ్యవధిలో నెల్లూరురూరల్ నియోజకవర్గానికి బదిలీ చేయించారు. వీఆర్వో మునిబాబు వెంకటాచలం గ్రామానికి చెందిన టీడీపీ నేత మునుస్వామి కుమారుడు కావడంతో సదరు నేతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సర్వేపల్లిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న టీడీపీ నేతపై సర్వేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జీ మెయిల్ ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న టీడీపీ నేత తీరు నచ్చక భవిష్యత్‌లో జరిగే స్థానిక ఎన్నికలను తాము బహిష్కరిస్తామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు విషయం గురించి అందరికీ తెలియడంతో నాయకుల మద్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment