పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికలకు సర్వం సిద్ధం
నెల్లూరు(క్రైమ్): పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జనవరి 9వ తేదీ వరకు జరుగుతాయి. ఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు మైదానానికి ప్రవేశించింది పరీక్షలు ముగించుకుని తిరిగి వెళ్లే వరుకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్ష ఘట్టాన్ని సూచించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎత్తు, ఛాతి కొలత, 1,600, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పోటీలు జరిగే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వైద్యశిబిరంతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించారు.
4,690 మంది
4,690 మంది అభ్యర్థులకు (పురుషులు 3,855 మంది, మహిళలు 835 మంది) పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండురోజులపాటు జరుగుతాయని సమాచారం. కాగా దేహదారుఢ్య పరీక్షలు మొదలైనప్పటి నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన బాడ్జీని ఏర్పాటు చేస్తారు. తొలుత సర్టిఫికెట్ల పరిశీలన, అనంతరం శారీరక కొలతలు తీసుకుంటారు. పరుగు పోటీల సమయంలో కాళ్లకు సెన్సార్ చిప్స్ అమర్చిన ట్యాగ్‌లు ఉంచుతారు. వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరుగు మొదలై ముగిసే సమయం వరకు ప్రతి సెకండ్‌ను ఆ చిప్ ద్వారా కంప్యూటర్‌లో నమోదవుతుంది. అనంతరం 1,600 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. పరుగులో ఉత్తీర్ణత సాధించిన వారికి 100 మీటర్లు, లాంగ్‌జంప్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రతి ఈవెంట్ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. 256 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.
పరిశీలించిన ఎస్పీ
ఎస్పీ కృష్ణకాంత్ ఆదివారం పోలీసు కవాతు మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో రిహార్సల్స్‌ను నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన, శారీరక కొలతలు, ఫిజికల్ ఎఫిషియన్సీ, 1,600, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ ఈవెంట్లకు సంబంధించి రిహార్సల్ సరళిని ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. అనంతరం బందోబస్తు విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. కాల్‌లెటర్ ఉన్న అభ్యర్థిని మాత్రమే అనుమతించాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు
సీసీ కెమెరాల ఏర్పాటు
పరీక్షల రిహార్సల్స్‌ను పరిశీలించిన ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment