వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
సంగం: మండల కేంద్రమైన సంగంలో ఆదివారం మోటార్‌బైక్‌ను ఆటో ఢీకొనడంతో పడమటిపాళెం పంచాయతీ ర్యాంపునకు చెందిన డి.నాగలక్ష్మి (54) అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. నాగలక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో బంధువుతో బైక్‌పై సంగం వచ్చింది. వైద్యం చేయించుకున్న అనంతరం తిరిగి వెళ్తుండగా స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఆటో బైక్‌ను ఢీకొట్టడంతో వెనుక కూర్చొని ఉన్న నాగలక్ష్మి కింద పడి తలకు తీవ్రగాయమై చనిపోయింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెం మార్చురీకి తరలించారు.
డివైడర్‌ను ఢీకొని..
కోవూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పడుగుపాడు చేపపిల్లల పెంపక కేంద్రం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు జంగంవీధికి చెందిన సాయివినీత్ (26) నెల్లూరు నుంచి కోవూరుకు మోటార్‌బైక్‌పై వస్తున్నాడు. అతి వేగం కారణంగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రంగనాథ్‌గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయివినీత్ నెల్లూరులోని ఓ ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం
ఆత్మకూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో జరిగింది. ఎస్సై షేక్ జిలానీ ఆదివారం వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని మంగళపూడికి చెందిన ప్రశాంత్ కుమార్ (29) అనే అతను ఏడాది కాలంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం బీసీ ముస్లిం కాలనీలో ఉంటున్నాడు. విభేదాలతో మొదటి భార్య నుంచి దూరమయ్యారు. అనంతరం వెంగమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవిస్తున్న ప్రశాంత్ కుమార్ శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్నాడు. చాలాసేపటి నుంచి ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని వెంగమ్మ గమనించింది. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఆమె భర్తను అడిగి బయటకు వెళ్లిపోయింది. ఈ సమయంలో వారి మధ్య స్వల్ప వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకున్నాడు. సమీపంలోని వారు గమనించి అతడిని కిందకు దించి ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. ఈ విషయమై మృతుడు తండ్రి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment