సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు
స్థానికం
విజృంభించిన దొంగలు
మెరుగైన సేవలందిస్తాం
● ఈ ఏడాదిలో కొట్టేసిన మొత్తం రూ.15.02 కోట్లు
● కూటమి ప్రభుత్వంలో మహిళలపై
పెరిగిన నేరాలు
● దొంగతనాల సంఖ్య కూడా ఎక్కువే..
నెల్లూరు(క్రైమ్): ఈ ఏడాది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రూ.15.02 కోట్ల మేర ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దొంగతనాలు పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై, పోలీసు అధికారులపై దాడులు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేశాయి. పోలీసు రికార్డులకెక్కిన నేరాల సంఖ్య కాస్త తగ్గినట్లు అనిపిస్తున్నా వాటి తీవ్రత మాత్రం ఎక్కువ అన్నది కఠోర సత్యం. తీవ్రమైన కేసుల్లో పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టి గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేయడం, లోక్‌అదాలత్‌లో వేల కేసుల పరిష్కారం తదితర విషయాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర పోలీస్ బాస్ ప్రశంసలను అందుకుంది. మొత్తంగా ఈ ఏడాది డెకాయిటీ, హత్యాయత్నాలు, హత్యలు, చీటింగ్, లైంగికదాడులు, మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు, దోపిడీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవి ఇంకా తదితర కేసులు 3,937 నమోదయ్యాయి.
మహిళలపై..
మహిళలపై కొన్ని నేరాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 20 మంది హత్యకు గురయ్యారు.
సంచలనం రేకెత్తించిన ఘటనలు
గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. ఏకంగా విధుల్లో ఉన్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును వాహనంతో ఢీకొట్టి పరారైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ కేసులో నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ మహిళా ఎస్సైపై దాడి జరిగింది. రౌడీషీటర్లు, ట్రాన్స్‌జెండర్ హత్య కేసులు కలకలం రేపాయి.
● ఈ ఏడాది నాలుగు విడతల్లో జరిగిన లోక్‌అదాలత్‌లో 34,065 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొబైల్ హంట్ ద్వారా ఏడు విడతల్లో రూ.8 కోట్ల విలువైన మూడు వేల సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు.
● ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై 34,780 కేసులు నమోదు చేసి రూ.1,80,43,100ల అపరాధరుసుము విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై 6,334 (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసులు, బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 8,652 కేసులు నమోదు చేశారు.
● గంజాయి అక్రమ రవాణాపై 13 కేసులు పెట్టి 111 కేజీల గంజాయి, 340 మత్తు మాత్రలను స్వాధీనం చేసుకుని 55 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఏడుగురి కోసం గాలిస్తున్నారు. మూడు వాహనాలను సీజ్ చేశారు.
● పదేపదే నేరాలకు పాల్పడుతున్న 16 మందిపై సస్పెక్ట్ షీట్లు తెరిచారు. మిస్సింగ్ కేసుల్లో సాంకేతికత ఆధారంగా ఛేదించి బాధిత కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. కావలి పట్టణంలో 14 నెలల బాలుడి మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో ఛేదించారు.
● హత్యలు 43, హత్యాయత్నాలు 116, తీవ్ర దాడులు 56 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే స్వల్పదాడులు 5.27 శాతం పెరిగాయి. పోక్సో, మహిళల నేరాలకు సంబంధించి 11 కేసుల్లో, రెండు వరకట్న మరణాలు, రెండు హత్యాయత్నం కేసుల్లో నిందితులకు జైలుశిక్షలు పడ్డాయి. డయల్ 112 ద్వారా పలువురిని రక్షించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని ఏర్పాటు చేయనున్నారు.
కొల్లగొట్టి..
సైబర్ నేరాలు గతేడాదితో పోల్చి చూస్తే 33.33 శాతం పెరిగాయి. గత సంవత్సరం నేరగాళ్లు రూ.7,27,72,000 సొత్తును కాజేయగా ఈ ఏడాది రూ.15,02,26,000 దోచుకోగా రూ.6,68,13,000 బ్యాంక్‌లో స్తంభింపజేశారు.
జిల్లాలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు విజృంభించి ప్రజల సొత్తును దోచుకెళ్లారు. మర్డర్ ఫర్ గెయిన్ కింద ఎనిమిది కేసులు నమోదయ్యాయి. రాత్రులే కాదు పగలు కూడా దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడ్డారు. పగటిపూట దొంగతనం కేసులు ఈ ఏడాది 33 నమోదయ్యాయి. గతంతో పోల్చి చూస్తే 13.79 శాతం పెరిగింది. సాధారణ దొంగతనాలు సైతం 1.30 శాతం పెరిగాయి.
ఈ ఏడాదిలో జరిగిన నేరాలు, రికవరీలు, పోలీసుల పనితీరును సోమవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో ఎస్పీ జి.కృష్ణకాంత్ వెల్లడించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాల వినియో గం వల్ల కలిగే ఇబ్బందులు, మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు విస్తృతం చేస్తామన్నారు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరం కలిసికట్టుగా పనిచేిస్తూ 2025లో జిల్లావాసులకు మెరుగైన సేవలందిస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment