న్యాయవాదులు కోర్టు విధుల బహిష్కరణ నేడు
నెల్లూరు (లీగల్): అనంతపురం బార్ అసోసియేషన్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది బీవీ శేషాద్రి పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందడం, రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి పోలీసులు న్యాయవాది జె.సుదర్శన్‌రెడ్డి పట్ల అమానుషంగా, దౌర్జన్య పూరిత చర్యలకు నిరసనగా నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహష్కరిస్తున్నుట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్య యాదవ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం అత్యవసర కమిటీ సమావేశం నిర్వహించి న్యాయవాదులపై పోలీసుల చట్టవ్యతిరేక చర్యలకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.
పెద్దాస్పత్రిలో డిప్యూటీ
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు (అర్బన్): రెండు రోజుల క్రితం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(పెద్దాస్పత్రి) అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి సోమవారం ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగుల వార్డు లు పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీటి వసతి, రోగులకు అందుతున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీలు, డాక్టర్స్ విశ్రాంత గదులు, ఐసీయూ, రక్తపరీక్షలు గదితర వాటిల్లో ఈ తనిఖీలు చేశారు. జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్‌బాషా, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గంగాధర్ తదితరులు ఆస్పత్రిలోని వార్డులను చూపించి అందుతున్న సేవలను వివరించారు. డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అందులో భాగంగానే ఆస్పత్రిలోని అన్ని విభాగాలను, పరికరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కో–ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు అబిదా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
సజ్జాపురం సర్పంచ్
చెక్ పవర్ రద్దు
నెల్లూరు (పొగతోట): నెల్లూరు రూరల్ మండలం సజ్జాపురం గ్రామ సర్పంచ్ నారాయణ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించిన నిధుల డ్రా చేయడం, ఖర్చు తదితర అంశాలకు సంబంధించి బిల్లులు, ఇతర వివరాలు అందుబాటులో లేవు. ఇందుకు సంబంధించి సర్పంచ్‌ని వివరణ కోరగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో సర్పంచ్ చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ నిధులు రూ.1,97,750, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,25,019 మొత్తం రూ.3,22,769 డ్రా చేయడం జరిగింది. డ్రా చేసిన నగదుకు సంబంధించి ఏ విధమైన రికార్డులు, ఆధారాలు చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో నిధులు దుర్వినియోగం అయినట్లు భావించి సర్పంచ్ చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంతో
అధిక దిగుబడులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక పంట దిగుబడులు సాధించవచ్చని జిల్లా సహకారశాఖాధికారి (డీసీఓ) గుర్రప్ప అన్నారు. డీసీఓ కార్యాలయంలో సోమ వారం దగదర్తికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీసీఓ మాట్లాడు తూ దగదర్తి మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం రైతులకు ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసి, పెట్టుబడులు తగ్గించి, అధిక దిగుబడులు సాధించేలా చూడాలన్నారు. పంటలకు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన పంటల ద్వారా ఆరోగ్యకరమైన వరిధాన్యం, కూరగాయలు పండించవచ్చన్నారు. పంటల సస్యరక్షణ, పంటల కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లను సంఘం ద్వారానే జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ కార్యాలయ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment