హద్దుమీరితే కఠిన చర్యలు
● ఎస్పీ జి. కృష్ణకాంత్
నెల్లూరు (క్రైమ్): నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇళ్ల వద్దనే సంతోషంగా జరుపుకోవాలని, హద్దుమీరితే చర్యలు తప్పవని ఎస్పీ జి.కృష్ణకాంత్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఆయన ఉమేష్‌చంద్రా కాన్ఫరెన్స్ హాల్లో నూతన సంవత్సరం సందర్భంగా శాంతిభద్రతలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి 2025 జనవరి ఒకటో తేదీ ఉదయం వరకు ప్రధాన కూడళల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్‌లు లేకుండా పెద్దపెద్ద శబ్దాలు చేసే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, మద్యం మత్తులో వాహనాలు నడిపినా కేసులు నమోదు చేస్తామన్నారు. రాత్రి 10 గంటల్లోపు దుకాణాలన్ని మూసివేయాలని, ప్రభుత్వ నిర్దేశిత వేళల వరకు మాత్రమే మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణకు అనుమతిస్తామన్నారు. వేడుకల పేరిట మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్ చేయడం, వారితో అనుచితంగా ప్రవర్తించడం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్, కార్లు నడిపేవారు సీట్ బెల్టు ధరించాలన్నారు. అశ్లీల ప్రకటనలు, పోస్టర్లు నిషిద్దమని, వేడుకల్లో అశ్లీల నత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. సమూహంగా వేడుకలు నిర్వహించాలనుకునే వారు ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురైనా వెంటనే 112కు ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment