యూట్యూబ్ జర్నలిస్టు ఆత్మహత్య
అనుమసముద్రంపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఎస్సై సైదుల సమాచారం మేరకు.. ఏఎస్‌పేటకు చెందిన సయ్యద్ రబ్బానీ (36) ఓ యూట్యూబ్ చానల్‌లో ఆత్మకూరు నియోజకవర్గ విలేకరిగా గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల గొడవలతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సైదులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు.
కూటమి నేతల మధ్య మద్యం వివాదం
● మఫ్టీలో ఉన్న పోలీసు అధికారిపైనే
దాడికి యత్నం
● ఇంత జరిగినా కౌన్సెలింగ్ ఇచ్చి
పంపిన పోలీసులు
ఆత్మకూరు: కూటమి పార్టీల నేతలు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారు. చోటా మొదలు బడా నాయకుల వరకు అధికారులను శాసించడంతోపాటు చివరకు దాడులకు కూడా తెగబడుతున్నారు. తాజాగా ఆత్మకూరు పరిధిలో జరిగిన ఓ వ్యవహారంలో టీడీపీ నేతలు ఓ పోలీస్ అధికారిపైనే దాడికి ప్రయత్నించినా.. వారిని ఏమీ చేయలేక కౌన్సెలింగ్ ఇచ్చి పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఏఎస్‌పేట మార్గంలోని ముస్తాపురం వద్ద ఉన్న ఓ లేఅవుట్ స్థలంలో ఆదివారం రాత్రి ఆ గ్రామానికి చెందిన కొందరు మద్యం తాగుతున్నారు. అదే సమయంలో ఆత్మకూరుకు చెందిన కూటమి నేతలు కొందరు మద్యం తాగేందుకు అక్కడికే వెళ్లారు. ఈ లేఅవుట్లో మందు తాగి సీసాలు పడేస్తారా? ఇది మాది అంటూ వారిని దబాయించారు. దీంతో స్థానికులు వెళ్లిపోయారు. భోగి పండగ రోజు స్థానికులు కొందరు లేఅవుట్ రాళ్లను పెరికి దూరంగా వేశారు. మద్యం తాగి ఖాళీ బాటిళ్ల అక్కడే పడేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మద్యం తెచ్చేందుకు లేఅవుట్‌కు సంబంధించిన వారిలో ఓ యువకుడు బైక్‌పై ఒంటరిగా వెళ్తుండడంతో గ్రామస్తులు అతన్ని వెంబడించి నిలిపి గొడవ పడ్డారు. ఈ విషయం తెలుసుకుని వీరూ అక్కడికి చేరుకోవడంతో గొడవ ముదిరింది. అదే సమయంలో ఆత్మకూరు డివిజన్ పోలీస్ ఉన్నతాధికారి ఆ మార్గంలో మఫ్టీలో వస్తుండగా చూసి ఘటనా స్థలానికి వచ్చారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనపై వారు దాడికి యత్నించారని సమాచారం. ఈ ఘటనను ఆ అధికారి వాహన డ్రైవర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే ఆ ఉన్నతాధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వీడియో సీఐకి పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సీఐ సిబ్బందితో వెళ్లి వారిలో 8 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గొడవకు కారణమైన వాళ్లు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కావడంతో విషయం రచ్చకెక్కకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం. ఈ విషయమై డీఎస్పీ కె వేణుగోపాల్‌ను సంప్రదించగా ఎలాంటి గొడవ చోటు చేసుకోలేదని, రోడ్డుపై కొందరు గుమిగూడి ఉంటే ఆ సమయంలో వస్తున్న తాను వారిని అరిచి పంపేశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment