2027లో జమిలి ఎన్నికలు ఖాయం
పొదలకూరు: 2027లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని, కార్యకర్తలు అందుకు సంసిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్వగ్రామం తోడేరులో కాకాణి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి మంగళవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ముందుగా సమితి మాజీ అధ్యక్షుడు, కాకాణి తండ్రి రమణారెడ్డి ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో సంక్రాంతి పండుగ కళ తప్పిందని, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు పండుగను జరుపుకోలేకపోయారని అన్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం కుదువ దుకాణాల వద్దకు బారులు తీరడంతో కుదువ దుకాణాలు కళకళలాడినట్టు తెలిపారు. గతేడాది ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నట్టు తెలిపారు. చంద్రబాబునాయుడు ఏ ఒక్క వర్గాన్ని సంతోష పెట్టలేకపోతున్నట్టు విమర్శించారు. రైతులను ఆదుకోకపోవడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేయకపోవడం, మహిళలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల పండుగలు వెలవెలపోయినట్టు తెలిపారు. సర్వేపల్లి ప్రజలతో పాటు, జిల్లా ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని కాకాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కూటమి పాలనలో కళతప్పిన సంక్రాంతి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment