తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌

Published Thu, Jan 16 2025 7:37 AM | Last Updated on Thu, Jan 16 2025 7:37 AM

తొలిద

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో బెడ్‌రిడన్‌ (మంచానికే పరిమితమైన) రోగులకు గతంలో డాక్టర్లు పరిశీలించి మంజూరు చేసిన సదరమ్‌ సర్టిఫికెట్‌లను ఇంటింటికీ వెళ్లి మళ్లీ రీవెరిఫికేషన్‌ చేసేందుకు ప్రభుత్వం పెద్దాస్పత్రిలోని డాక్టర్లను నియమించడంతో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దివ్యాంగులు, బెడ్‌రిడన్‌ రోగులైన అర్హులందరికీ డాక్టర్ల ద్వారా సదరమ్‌ సర్టిఫికెట్‌లు ఇచ్చి పింఛన్లు మంజూరు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఒక్కరు కూడా పింఛన్‌ రాలేదని అనకుండా ఉండేలా సాచురేషన్‌(జీరో) స్థాయికి పింఛన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. నేటి కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లకు కోత పెట్టేందుకు పావులు కదిపింది. తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పూనుకుంది. తొలిదశలో బెడ్‌రిడన్‌ పేషెంట్లకు కోత పెట్టేందుకు డాక్టర్లను రీవెరిఫికేషన్‌ పేరిట ఇంటింటికీ పంపుతోంది. ప్రధానంగా నగరంలోని పెద్దాస్పత్రిలో ఉండే డాక్టర్లను రీవెరిఫికేషన్‌కు పంపడంతో రోగులకు వైద్యం అందడం లేదు.

దశలవారీగా ‘కోత’

ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్‌దారుల సర్టిఫికెట్‌ల రీవెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. ప్రజావ్యతిరేకత ఒక్కసారిగా రాకుండా ప్రభుత్వం దశల వారీగా పింఛన్లకోతకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో 3,07,000 మంది సామాజిక పింఛన్‌దారులున్నారు. వారిలో దివ్యాంగులైన వారు 32వేల మంది. బెడ్‌రిడన్‌ రోగులు 1279 మంది. సామాజిక పింఛన్‌లు ఒక్కొక్కరికీ రూ.3వేల నుంచి 4వేలకు, దివ్యాంగులకు రూ.6వేలకు, బెడ్‌రిడన్‌ రోగులకు రూ.15వేలకు పెంచుతున్నామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచినట్టు పెంచి ఇప్పుడు ఆ పింఛన్లకు భారీస్థాయిలో కోత విధించేందుకు పూనుకుంది.

సదరమ్‌ సర్టిఫికెట్‌ల నిలిపివేత

ఉన్న సదరమ్‌ సర్టిఫికెట్‌లను వెరిఫై చేసేంత వరకు కొత్త సదరమ్‌ సర్టిఫికెట్‌లను జారీ చేయవద్దని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి మంగళవారం, శుక్రవారం పెద్దాస్పత్రిలో జరిగే సదరమ్‌ క్యాంపులు నిలిచిపోయాయి. ఫలితంగా వికలాంగత్వం ఉన్నట్టు సదరమ్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే తమకు పింఛన్‌ వస్తుందని ఆశించిన దివ్యాంగుల ఆశ అడియాశ అయింది.

మంజూరైనవీ ఆపేశారు

పెద్దాస్పత్రిలో గతంలో దరఖాస్తు చేసుకుని డాక్టర్లు పరిశీలించి వికలాంగత్వ శాతాన్ని ధ్రువీకరించి సంతకం చేసిన సర్టిఫికెట్‌లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్ధానాయక్‌ లాగిన్‌లో 92 సిద్ధంగా ఉన్నాయి. వీటిని కూడా సూపరింటెండెంట్‌ రిలీజ్‌ చేయలేదు. ఆ 92 మంది పొట్ట కూడా కొట్టారు. మరో వైపు మరో 80 మంది ఇప్పటికే సదరమ్‌ సర్టిఫికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇవన్నీ నిలిచిపోయాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు సైతం ప్రభుత్వం అవకాశం కల్పించలేదు.

వైద్యసేవలు నిర్వీర్యం

అనుభవజ్ఞులైన డాక్టర్లు క్షేత్ర స్థాయిలో రీవెరిఫికేషన్‌కు పోవడంతో పెద్దాస్పత్రిలో వైద్యసేవలు నిర్వీర్యంగా మారాయి. ఎంబీబీఎస్‌ చదువుతూ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న ట్రైనింగ్‌ డాక్టర్లు చేసే వైద్యం అంతంత మాత్రమే. పెద్దాస్పత్రిలో రోజుకు 1200 నుంచి 1500 వరకు ఓపీ రోగులుంటారు. 550 మంది వరకు అడ్మిషన్‌లో రోగులుంటారు. ఈ రోగులకు ట్రైనింగ్‌లో ఉన్న జూనియర్‌ డాక్టర్లే వైద్య సేవలందిస్తూ ఉండటం వల్ల నాణ్యమైన వైద్యం రోగులకు అందడం లేదు. ముసలి వారైన ప్రొఫెసర్లు అడ్మిషన్‌లో ఉన్న రోగుల వద్దకు వెళ్లాలి. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠాలు బోధించాలి. అప్పటికే వీరికి ఓపిక తగ్గిపోతోంది. ఇక ఓపీ సేవలు అందించాలంటే వారికి కష్టంగా మారుతుంది. పెథాలజి లాంటి కోర్సు చేసిన నాన్‌–క్లినికల్‌ డాక్టర్లు ఇప్పటి వరకు వారి చరిత్రలో రోగులకు వైద్యం చేయలేదు. డాక్టర్లు కొరత ఉండటంతో అలాంటి కొంతమంది నాన్‌–క్లినికల్‌ వైద్యుల ద్వారా రోగులకు సేవలందిస్తున్నారు. వీరికి కొత్తగా వచ్చిన మందుల గురించి కూడా అవగాహన తక్కువే. అందువల్ల వారు చేసే సేవలు అంతంత మాత్రమే. హుషారుగా ఉండే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు(డాక్టర్లు) సదరమ్‌ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌కు వెళ్లడంతో రోగుల వైద్యం.. గాల్లో దీపంలా మారింది. ఇకనైనా పరిస్థితులు చక్కదిద్దాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రీ వెరిఫికేషన్‌కు డాక్టర్ల బృందం

వైద్యం అందక రోగుల ఇబ్బందులు

తొలి దశలో బెడ్‌రిడన్‌ రోగులు

రెండో దశలో దివ్యాంగులకు కత్తెర

జిల్లాలో 1,279 మంది బెడ్‌రిడన్‌,

32 వేల దివ్యాంగుల పింఛన్లు

కొత్తగా సదరమ్‌ సర్టిఫికెట్ల జారీ నిలిపివేత

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం

డాక్టర్లు సదరమ్‌ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌కు వెళ్లినప్పటికీ ఆ కొరత లేకుండా తాము ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేశాం. వెరిఫికేషన్‌కు వెళ్లిన వారు కూడా మధ్య, మధ్యలో కొన్ని రోజులు ఆస్పత్రికి వస్తుంటారు. ఇక్కడ పీజీ చేస్తున్న మంచి వైద్యులున్నారు. కొంతమందిని నాన్‌క్లినికల్‌ వారిని సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నాం. – డాక్టర్‌ సిద్ధానాయక్‌,

సూపరింటెండెంట్‌, సర్వజన ఆస్పత్రి

నెల్లూరు జిల్లాలో 1279 మంది బెడ్‌రిడన్‌ రోగులున్నారు. అలాగే తిరుపతి, చిత్తూరు లాంటి అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు. వీరిని క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్‌ చేసేందుకు నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన 11 మంది డాక్టర్లను, ఆర్ధోపెడిక్‌ విభాగానికి చెందిన ఆరుగురిని, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల నుంచి మరో ఆరుగురిని నియమించారు. వీరు తిరుపతి, చిత్తూరు జిల్లాలలోని బెడ్‌రిడన్‌ రోగులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు పొందిన సదరమ్‌ సర్టిఫికెట్‌లను మరలా సర్టిఫై చేయాల్సి ఉంది. అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చి ఇక్కడి రోగులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. ఇలా పరిశీలించే సందర్భంగా అధికారుల మౌఖిత ఆదేశాల మేరకు కనీసం 40 శాతం సర్టిఫికెట్‌లను రద్దు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

ఆరు నెలల సమయం పట్టవచ్చు

జిల్లాలో బెడ్‌రిడన్‌ రోగులను మళ్లీ పరీక్షించేందుకు సుమారు 2 నెలలు పడుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మిగతా దివ్యాంగుల సర్టిఫికెట్‌లను వెరిఫై చేయాల్సి ఉంది. ఇందుకు మరో 4 నెలల సమయం పట్టనుంది. మొత్తం 6 నెలల వరకు డాక్టర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి రోగులను పరీక్షించాల్సి ఉంది. అనుమానితులను పెద్దాస్పత్రికి తీసుకుని వచ్చి పరీక్షలు చేయించాల్సి ఉంది. ఈ 6 నెలల కాలంలో రోగులకు నాణ్యమైన వైద్యం అందక అల్లాడిపోతారని డాక్టర్లు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌ 1
1/3

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌ 2
2/3

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌ 3
3/3

తొలిదశలో 1279 మందికి రీవెరిఫికేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement