జోరుగా కోడిపందేలు
● ప్రేక్షకపాత్రలో పోలీసులు
ఉదయగిరి: సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని సోమ, మంగళ, బుధవారాల్లో ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలలో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టి, సై అంటే సై అంటూ బరిలోకి దింపారు. ఈ పోటీల్లో లక్షలాది రూపాయల పందేలు జోరుగా సాగాయి. ఉదయగిరి మండలంలోని చెరువుపల్లి, చెర్లోపల్లి, కృష్ణంపల్లి, వెంకట్రావుపల్లి తదితర గ్రామాలలో పోటీలు జరిగాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం, తోటలచెరువుపల్లి, పెద్దిరెడ్డిపల్లి, విరువూరు తదితర గ్రామాలు, కొండాపురం మండలం తూర్పుయడవల్లి, చింతలదేవి గ్రామాలలో కూడా కోడిపందేలు జరిగాయి. ఈ సందర్భంగా పై పందేలు లక్షల్లో జరిగాయి. నిర్వాహకులు పోలీసులకు మామూళ్లు ఇవ్వడంతో బహిరంగంగా కోడిపందేలు జరుగుతున్నా కనీసం ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు.
ఆర్చరీ జట్ల ఎంపికలు 19న
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా ఆర్చరీ జట్ల ఎంపికలను ఈనెల19న స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పల్లంరెడ్డి శ్రీహర్ష, పావురాల వేణులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 9441955334 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
శ్రీవారి సేవలో జ్యోతిర్మయి
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో వెలసియున్న శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని ప్రముఖ ప్రవచన కర్త, గాయని కొండవీటి జ్యోతిర్మయి కుటుంబసభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. ఈమెకు దేవస్థాన అధికారులు స్వాగతం పలికి మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె శ్రీవారికల్యాణ మండపంలో నరసింహస్వామిని కీర్తిస్తూ పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
హైదరాబాద్, బెంగళూరులకు 81 ప్రత్యేక బస్సులు
నెల్లూరు సిటీ: సంక్రాంతి పండుగను ముగించుకుని తిరిగి హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లేందుకు జిల్లా నుంచి ఆర్టీసీ 81 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి మురళీబాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 51 బస్సులు, బెంగళూరుకు 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయ న్నారు. సాధారణ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సంక్రాంతి కిక్కు
రూ.21 కోట్లు
నెల్లూరు(క్రైమ్): సంక్రాంతి పండుగ నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. అక్షరాల రూ.21.02 కోట్ల మద్యాన్ని తాగేశారు. ఈనెల 14, 15 తేదీల్లో ఐఎంఎల్ డిపోకు సెలవు కావడంతో వ్యాపారులు ముందుగానే భారీగా స్టాక్‌ను మద్యం దుకాణాల్లో నిల్వ చేశారు. 11 నుంచి 13వ తేదీ వరకు రూ.21,02,50,000 విలువ చేసే మద్యాన్ని వ్యాపారులు ఐఎంఎల్ డిపో నుంచి కొనుగోలు చేశారు. పండుగ రోజుల్లో మద్యం ప్రియులు మత్తులో మునిగి తేలారు. వారితో మద్యంషాపులు, బార్లు కిక్కిరిశాయి. మద్యం దుకాణాల్లో అధికంగా సేల్ అయ్యే బ్రాండ్లు ఖాళీ అవడం, డిపో నుంచి సరుకు వచ్చే అవకాశం లేకపోవడంతో చేసేదేమీ లేక ఉన్న బ్రాండ్లతోనే మందుబాబులు సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment