అక్రమ లేఅవుట్లను ఉపేక్షించేదిలేదు
● మంత్రి నారాయణ
నెల్లూరు(బారకాసు): అక్రమ లేఅవుట్లు, అక్రమ భవన నిర్మాణాలను ఉపేక్షించేదిలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నుడా, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి లేఅవుట్లు వేసినా, భవన నిర్మాణాలు చేపట్టినా వాటిని గుర్తించి తొలగించేందుకు వెనుకాడబోమని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో నూతన సంస్కరణలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. లేఅవుట్లు, భవన నిర్మాణాల విషయమై టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన దాదాపు 18 అంశాల్లో మార్పులు చేసి ప్రజలకు అనుకూలంగా సులభతరం చేశామని తెలిపారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే మంజూరు చేయనున్నామని వివరించారు. 11 ఫైళ్లను పరిశీలించిన అధికారులు కొర్రీలు వేశారని, దీనికి గానూ ఆయా యజమానులను పిలిపించామన్నారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకున్నామని పేర్కొన్నారు. సక్రమంగా ఉన్న వాటికే అనుమతులివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. లేఅవుట్ యజమానులు, వ్యాపారులు అన్ని అనుమతులు పొందితే పన్నులు, జీఎస్టీ తదితరాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతులను పొందాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని పేర్కొన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజ, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, ఆర్డీఓ అనూష, సిటీ ప్లానర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment