పాకల తీరంలో ఘోరం
కందుకూరు / పొన్నలూరు / సింగరాయకొండ /: సింగరాయకొండ మండలంలోని పాకల తీరం కన్నీటి సంద్రమైంది. సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా గడిపి సేదతీరేందుకు సముద్రానికి వెళ్లిన వారిని కడలి బలిగొంది. ఘటనలో ఇద్దరు బాలికలు, ఓ యువకుడు మృతి చెందారు. అప్పటి వరకు కేరింతలు కొట్టిన వారు క్షణాల్లో విగతజీవులవడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.
ఉత్సాహంగా వెళ్లి..
పొన్నలూరు మండలం తిమ్మపాళెం పంచాయతీ శివన్నపాళెం ఎస్సీ కాలనీకి చెందిన శింగయ్య, వరమ్మ దంపతుల కుమారుడు నోసిన మాధవ (25)కు కందుకూరు మండలం అనంతసాగరానికి చెందిన నవ్యతో ఆర్నెల్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగించే ఈయన సంక్రాంతి సందర్భంగా గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో సింగరాయకొండ మండలం పాకల బీచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు గ్రామంలోని బంధువులు కలిసి టెంపో ఆటోను మాట్లాడుకున్నారు. దారిలో నవ్య చెల్లెలు, తమ్ముడు యామిని, ఫణీంద్రను ఆటోలో ఎక్కించుకున్నారు. మొత్తం 15 మందికిపైగా తీరానికి చేరుకున్నారు. అందరూ సము ద్రంలో జలకాలాడుతూ ఉల్లాసంగా గడిపారు. శ్రుతి మించిన ఉత్సాహమే వీరిపాలిట శాపంగా మారింది.
లోతును అంచనా వేయలేక..
ఈ క్రమంలో కొందరు ఇంకా కొంచెం లోతైన ప్రాంతానికి వెళ్లారు. వీరిలో ఐదుగుర్ని అలలు లాక్కెళ్లిపోయాయి. నోసిన మాధవ (25), కొండాబత్తిన యామి ని (14), నోసిన జెస్సికా (13) ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు త్రుటిలో బయటపడ్డారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతుల బంధువులు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
విషాదఛాయలు
మాధవ, యామిని, జెస్సికా మృతి చెందడంతో శివన్నపాళెం, కొల్లగుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకొన్న వీరు మృత్యువాత పడటంతో బంధువులు, గ్రామస్తులు రోదిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త, చెల్లెల్ని కోల్పోయి..
పొన్నలూరు మండలంలోని విప్పగుంట హైస్కూల్లో తొమ్మిదో తరగతిని యామిని చదువుతున్నారు. అలల ధాటికి కొట్టుకుపోయి ప్రాణాలొదిలారు. దీంతో భర్త, చెల్లెల్ని నవ్య కోల్పోయారు. తన కళ్ల ఎదుటే జరిగిన ప్రమాదంతో ఆమె షాక్‌కు గురయ్యారు.
కళ్లెదుటే జరిగినా నిస్సహాయత
శివన్నపాళేనికి చెందిన మంగయ్య, సువర్ణరాణి కుమార్తె జెస్సికా మాలపాడులోని కేజీబీవీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ఎదుటే కుమార్తె కొట్టుకుపోతున్నా, ఏమీ చేయలేని దీనస్థితి వారిది.
బాధితులకు పరామర్శ
పాకల బీచ్‌లో మునిగి మరణించిన వారి కుటుంబసభ్యులను మంత్రి బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ దామోదర్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు.
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారులు.. పెళ్లయి ఆర్నెల్లయిన నవ దంపతులు.. కుటుంబసభ్యులు అందరూ కలిసి సంక్రాంతిని వేడుకగా జరుపుకొన్నారు. సేదతీరాలనే ఉద్దేశంతో సముద్ర తీరానికి చేరుకున్నారు. కేరింతలు కొడుతూ.. సముద్ర స్నానాలు చేస్తూ.. ఫొటోలు దిగి తమ ఈ ప్రయాణం జీవితంలో ఓ మధురానుభూతిని మిగిలిస్తుందని కలలుగన్నారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో వీరిలో నవ వరుడు.. ఇద్దరు చిన్నారులను కడలి బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన సింగరాయకొండ మండలం పాకలలో గురువారం చోటుచేసుకుంది.
సముద్రంలో మునిగి ఇద్దరు బాలికలు, యువకుడి మృతి
రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం
మిన్నంటిన రోదనలు
నాలుగైదు నిమిషాల్లోనే ఘోరం
20 మంది వరకు పాకల సముద్ర తీరానికి వెళ్లాం. మునిగే క్రమంలో బాత్ రూమ్‌కు అని ఒడ్డుకొచ్చా ను. వెళ్లేలోపే మాలో కొందరు కొట్టుకుపోయారు. స్థానికంగా ఉండే మత్స్యకారులతో మాట్లాడి బోట్లు వేసుకొని కొట్టుకుపోయిన వారి కోసం వెతికాం. ఆ సమయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగైదు నిమిషాల్లోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. – వెంకటేష్, ప్రత్యక్ష సాక్షి
Comments
Please login to add a commentAdd a comment