కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం
పొదలకూరు: ‘కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. అన్నదాతలు దగా పడ్డారు. చంద్రబాబుకు ఓట్లు వేసి మోసపోయారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నేదురుమల్లి, వెలికంటిపాళెం, శాంతినగర్, పులికల్లు గ్రామాల్లో గురువారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా తనను కలిసిన గ్రామస్తులు కూటమికి ఓట్లు వేసి మోసపోయామని, ఏ ఒక్క పథకం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడా చూసినా అవినీతి, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయని, అభివృద్ధి ఊసే లేదన్నారు. ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి అవినీతికి పాల్పడినట్టు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారుల తీరు మారలేదని, ఈ పర్యాయం కఠినంగా వ్యవహరించి తిన్న ప్రజల సొమ్ము కక్కించడం జరుగుతుందన్నారు. సూపర్ సిక్స్ పేరిట చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు గుర్తుచేసుకుని బాధపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి పది సీట్లు కూడా రావన్నారు. తమ హయాంలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. అధికారం ఉన్నా లేకున్నా జనం మధ్య ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకుంటానని తెలిపారు. వైఎస్సార్‌సీపీని జిల్లాలో తిరుగులేని శక్తిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. నాగయ్యనాయుడు, బాలిరెడ్డి, వెంకటరమణయ్యగౌడ్, ఎంపీటీసీ సుగుణమ్మ కుటుంబసభ్యులు ఇటీవల మృతిచెందడంతో కాకాణి వారి గృహాలకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పెంచలనాయుడు, మల్లారెడ్డి, వెంకటరమణయ్యనాయుడు, డి.వెంకటరమణారెడ్డి, వై.పెంచలరెడ్డి, చంద్రమౌళి, ఆకుల లక్ష్మి, జనార్దనరెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడ చూసినా అవినీతి, దౌర్జన్యాలు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment