ఆధ్యాత్మిక శోభితం
ఆలయాలకు నిలయంగా మనుబోలు
పురాతన విష్ణాలయం
● ఒక్కో గుడికి ప్రత్యేక చరిత్ర
● కొన్ని శిథిలావస్థకు చేరిన వైనం
చరిత్ర ఇలా..
విష్ణాలయాన్ని 12 శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. కండలేరు ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయానికి సంబంధించి పెద్దలు ఈ విధంగా వెల్లడిస్తుంటారు. పరశురాముడు తల్లిని సంహరించిన అనంతరం పాప ప్రక్షాళన కోసం దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలను నిర్మించాడు. అయినా పాప పరిహారం జరగకపోవడంతో ఆయన తండ్రి, గురువు అయిన జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు చివరగా మనుబోలు సమీపంలోని కండలేరు ఒడ్డున సంగమేశ్వరాలయాన్ని నిర్మించాడు. తూర్పు ముఖ ద్వారంతో ఉన్న ఈ గుడిలో వెలుపలకు వెళ్లే మార్గం దక్షిణం వైపు ఉంటుంది. వచ్చి వెళ్లే మార్గాలు వేరుగా ఉండటంతో భక్తుల పాప ఫలాలు అక్కడే ఆగిపోతాయని అనాదిగా వస్తున్న నమ్మకం. ఏటా ఏప్రిల్‌లో నిర్వహించే సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని తిలకించేందుకు ఎంతోమంది భక్తులు తరలివస్తారు. 20 అడుగులు ఎత్తున్న స్వామి రథాన్ని మనుబోలు శివాలయం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరాలయానికి భక్తులు తమ భుజాలపై మోసుకెళ్లి తీసుకురావడం ప్రత్యేకత.
స్పందిస్తే..
కొన్ని ఆలయాలు శతాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న పురాతన శ్రీదేవి, భూదేవి సమేత విష్ణాలయంతోపాటు కుడి చెరువు గట్టున ఉన్న శివాలయం, కండలేరు ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయం, దళితవాడలోని చెన్నకేశవాలయం శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం, దాతలు స్పందించి మరమ్మతులు చేయించాలని అర్చకులు, గ్రామస్తులు కోరుతున్నారు.
పూర్వ వైభవం తేవాలి
ఎంతో చరిత్ర ఉన్న ఆలయాలు కొన్ని నేడు శిథిలావస్థకు చేరుకుని ఆదరణ కరువైన వైనం చూస్తుంటే బాధ వేస్తోంది. కొన్ని ఆలయాలకు ఆదాయం లేకపోవడంతో ధూప దీప నైవేద్యాలు పెట్టేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఆలయాలకు పూర్వ వైభవం తేవాలి. – దుగ్గన రామచంద్రయ్య
ఉత్సవాలను ఆపలేదు
గ్రామంలో భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యం ఎక్కువ. కరువు కాటకాలు, ఉపద్రవాలు ఎదురైనా ఆయా ఆలయాలకు సంబంధించి ఏటా నిర్వహించే ఉత్సవాలను ఎప్పుడూ ఆపింది లేదు. – మారంరెడ్డి రాజారామిరెడ్డి
మండల కేంద్రమైన మనుబోలు ఆధ్యాత్మి క నిలయంగా విరాజిల్లుతోంది. సహజంగానే గ్రామంలో భక్తిభావం ఎక్కువ. పదివేల్లోపు జనాభా ఉన్న ఊరిలో 20 దేవాలయాలు ఉండటం విశేషం. ఇందులో మూడు వేల జనాభా ఉన్న పాత ఊరిలోనే 15 గుడులున్నాయి. పడమటి వీధిలో ఉన్న రామాలయంలో నిత్యం భజనలు చేస్తూనే ఉంటారు. 70 ఏళ్లుగా ఇది జరుగుతోంది. గ్రామంలో నాలుగు రామాలయాలు, శివాలయం, విష్ణాలయం, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి, వీరభద్రస్వామి, సంగమేశ్వర, ప్రసన్నాంజనేయస్వామి, వినాయకస్వామి, మనుబోలమ్మ, నాగార్పమ్మ, గంగమ్మ ఆలయాలు, సాయిబాబా, వెంకయ్యస్వామి మందిరాలు, పోలేరమ్మ ఆలయం, మాతమ్మ ఆలయాలున్నాయి.
– మనుబోలు
Comments
Please login to add a commentAdd a comment