కుష్టు వ్యాధిపై 20 నుంచి ఇంటింటి సర్వే
నెల్లూరు (అర్బన్): కుష్టు వ్యాధిపై జిల్లాలో ఈ నెల 20 నుంచి వచ్చే నెల రెండు వరకు ఇంటింటి సర్వేను నిర్వహించనున్నామని లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి ఖాదర్‌వలీ పేర్కొన్నారు. నెల్లూరు కపాడిపాళెంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఏఎన్‌ఎంలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని చెప్పారు. వ్యాధికి సంబంధించిన మందులు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబా టులో ఉన్నాయన్నారు. ఆశ కార్యకర్త, పురుష వలంటీర్ ప్రతి ఇంటికీ వెళ్లి సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. జేఎన్నార్ కాలనీ మెడికల్ ఆఫీసర్లు మానస, పర్వీన్, కల్యాణి, సీఓ విజయలక్ష్మి, డీపీఎంఓలు సుబ్బయ్య, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
నెల్లూరు (టౌన్): నగరంలోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో రహదారి భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఇన్‌చార్జి డీటీసీ సిరి చందన మాట్లాడారు. కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించనున్నామని వివరించారు. రహదారి ప్రమాదాలు, నిబంధనలు తదితరాలపై వాహనదారులకు అవగాహన కల్పించనున్నామని చెప్పారు. ఎమ్వీఐలు బాలమురళీకృష్ణ, రఫీ, ఏఎమ్వీఐలు స్వప్నిల్‌కుమార్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, ఏఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
మంత్రి పర్యటన
నెల్లూరు(అర్బన్): రాష్ట్ర రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడాల శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ డీడీ సదారావు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
● పది మందికి గాయాలు
మర్రిపాడు: ప్రభుత్వ భూమి విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మంది గాయపడిన ఘటన మండల పరిధిలోని నాగినేనిగుంట పంచాయతీలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని బాటలో 332 సర్వే నంబర్‌లో 345.30 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో జరిగిన భూ పంపిణీలో తనకు పట్టా ఇచ్చారని తుపాకుల ధనమ్మ చెప్తున్నారు. ఈ క్రమంలో ఈటె వెంకటయ్య వర్గం వారు ఈ పొలాన్ని ట్రాక్టర్‌తో రెండు రోజుల క్రితం చదును చేశారు. తాజాగా తుపాకుల ధనమ్మ వర్గం వారు జామాయిల్ మొక్కలను గురువారం నాటుతుండగా, వెంకటయ్య తన వర్గంతో అక్కడికి వెళ్లారు. వీరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో వెంకటసుబ్బయ్య, సురేంద్ర, నరేష్, రామ కృష్ణ, వెంకటకృష్ణ, రమణయ్య, రమేష్, హరిబాబు, వెంకటయ్య, రమేష్ గాయపడ్డారు. కాగా ఈ అంశమై ఇన్‌చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్‌యాదవ్‌ను సంప్రదించగా, సంబంధిత భూమిని పరిశీలించి చర్యలు చేపడతామని బదులిచ్చారు.
అసైన్డ్ భూముల
రిజిస్ట్రేషన్ల నిలిపివేత
నెల్లూరు సిటీ: అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రెండు నెలల పాటు చేయొద్దంటూ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment