అశేష ప్రజానీకంతో కిక్కిరిసిన పినాకినీ తీరం
భక్తజనసంద్రం.. పినాకినీ తీరం
భక్తిశ్రద్ధలతో గొబ్బెమ్మల నిమజ్జనం
ఆటపాటలతో కోలాహలం
నెల్లూరు(బృందావనం): సంక్రాంతి సంబరాల్లో చివరిదైన ఏటి పండగతో నెల్లూరు నగరంలోని పవిత్ర పినాకినీ తీరం గురువారం జనసంద్రంగా మారింది. గొబ్బియలో.. గొబ్బియలో.. సంక్రాంతి పండగొచ్చె గొబ్బియలో అనే గీతాలు.. పతంగులను ఎగురవేస్తూ యువత.. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రాంతం కోలాహలంగా మారింది.
భారీగా రాక
ధనుర్మాసంలో తమ ఇళ్లలో భక్తిశ్రద్ధలతో పూజించిన గొబ్బెమ్మ లను ఊరేగింపుగా పవిత్ర పినాకినీ తీరానికి మహిళలు తీసుకొచ్చారు. సుఖసంతోషాలు, అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని.. కుటుంబాలను దీవించాలని గౌరమ్మ తల్లిని వేడుకుంటూ పినాకిని తీరంలో నిమజ్జనం చేశారు. ఒకరికొకరు కుంకుమ, బొట్లు పెట్టుకుంటూ.. పసుపు, కుంకుమ, గాజులను గంగమ్మ తల్లికి సమర్పించారు. పిండి వంటలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ.. నదీతీరాన ఉన్న తినుబండారాలను అల్పాహారంగా సేవిస్తూ ఉత్సాహంగా గడిపారు.
కొలువైన దేవతామూర్తులు
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులు పినాకినీ తీరానికి తరలివచ్చి భక్తులను అనుగ్రహించారు. గణనాథుడు, ఇరుకళల పరమేశ్వరి, రాజరాజేశ్వరి అమ్మవారు, తల్పగిరి రంగనాథుడు, మూలస్థానేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, ధర్మరాజస్వామి, వేదగిరి లక్ష్మీనృసింహుడు, జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారు, నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారు కొలువై భక్తులను కటాక్షించారు. విశేష పుష్పాలంకారంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. దర్శనానికి భక్తు లు బారులుదీరారు. ప్రసాదాలను అందజేశా రు. మంత్రి నారాయణ, దేవదాయ శాఖ జిల్లా అధికారి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment