అంతులేని నిర్లక్ష్యం
శిథిలమైన సమాచార కేంద్రం
సూళ్లూరుపేట: ఓ వైపు ఫ్లెమింగో ఫెస్టివల్ సమీపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. సూళ్లూరుపేట – శ్రీహరికోట మార్గంలో కుదిరి వద్ద ఏర్పాటు చేసి పక్షుల సమాచారం కేంద్రం పనిచేసి కొన్ని సంవత్సరాలైంది. పక్షుల సమాచారం కేంద్రంలో సమాచారం ఇచ్చే సిబ్బంది లేకపోవడంతో ఈ భవనం పూర్తిగా శిథిలమైపోయింది. దీంతో ఈ భవనం మద్యం తాగేందుకు, పేకాట ఆడేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. విదేశీ వలస విహంగాలు విడిది చేసిన దృశ్యాలను తిలకించేందుకు పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం వారు అక్కడక్కడా గ్రానైట్ రాళ్లతో బెంచీలు ఏర్పాటు చేశారు. ఎండ తగలకుండా నీడను కల్పించేందుకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం వారు రేకుల షెడ్లు కట్టించారు. అదేవిధంగా కుదిరి – అటకానితిప్పకు మధ్య బర్డ్స్ వాచ్ టవర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే వైల్డ్‌లైఫ్ వారి పర్యవేక్షణ పూర్తిగా కొరవడడంతో వీటిని మందుబాబులు బార్లుగా ఉపయోగించుకుంటున్నారు. వ్యూ పాయింట్లలో బెంచ్‌లను పగులగొట్టి నిలబడేందుకు కూడా వీల్లేకుండా తయారు చేశారు.
మరమ్మతులు చేయకుండా..
సూళ్లూరుపేట – శ్రీహరికోటకు మధ్యలో ఉన్న అటకానితిప్పలో వైల్డ్ లైఫ్ వారు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. దీన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు వ్యూ పాయింట్ల వద్ద కూర్చుని పక్షులను వీక్షిస్తుంటారు. పులికాట్ సరస్సుకు ఈ సీజన్‌లో సుమారు 152 రకాల విదేశీ, స్వదేశీ విహంగాలు వచ్చాయి. వీటిని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఈ వ్యూ పాయింట్లకు మరమ్మతులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇష్టారాజ్యంగా..
సూళ్లూరుపేట కేంద్రంగా నడుస్తున్న వైల్డ్ లైఫ్‌లో సిబ్బంది కొరత పీడిస్తోంది. బీట్ ఆఫీసర్లుగా వేసిన వారు అక్కడకు వెళ్లి విధులు చేయకుండా సైడ్ బిజినెస్‌లలో లీనమైపోయారు. ఇక్కడ ఒక డీఎఫ్‌ఓ, రేంజర్ అధికారి ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. ఈ రెండు పోస్టులను దూర ప్రాంతాలకు చెందిన వారిని పంపిస్తుడటంతో వారు ఏదో విజిట్‌కు వచ్చినట్టు వచ్చి వెళ్తున్నారు. కింది స్థాయి సిబ్బంది కూడా సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పులికాట్ సరస్సుకు భద్రత కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ శాఖ నామమాత్రంగా మారింది. సరస్సులో గుల్ల తీసేయడం, వానపాములను తవ్వేయడం వంటి కార్యకలాపాలపై నిఘా కొరవడింది. గుల్ల తవ్వకాలు, వానపాములు తవ్వకాల్లో ఇంటి దొంగల పాత్ర ఎక్కువైపోవడంతో దీన్ని నిరోధించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోలా దాడులు చేయడం కూడా పూర్తిగా మరిచిపోయారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ తరాల వారికి పులికాట్ సరస్సును, ఇక్కడకొచ్చే విదేశీ వలస విహంగాలను మ్యాప్‌ల్లో చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
సమీపిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025
దుస్థితిలో పక్షుల సమాచార కేంద్రం
మద్యం తాగే కేంద్రాలుగా మారిన బర్డ్స్ వ్యూ పాయింట్లు
పట్టించుకోని వైల్డ్ లైఫ్ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment