ఆక్రమిస్తాం.. దున్నేస్తాం
మర్రిపాడు: జిల్లాలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న మర్రిపాడు మండలం మీదుగా మూడు జాతీయ రహదారులు ఉన్నాయి. దీంతో ఇక్కడి భూములకు బాగా గిరాకీ పెరిగింది. ఆక్రమణదారుల కళ్లు ఇక్కడి ప్రభుత్వ భూములపై పడ్డాయి. ఇంకేముంది కనిపించిన భూమిని కబ్జా చేస్తూ రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నారు.
మండలంలో 24 గ్రామ పంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 66 గ్రామాల్లో 1.20 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రభుత్వ భూములు, అనాధీనం 27 వేల ఎకరాల్లో... పోరంబోకు, మేత పోరంబోకు 10 వేల ఎకరాలు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మండలంలోని చిన్నమాచనూరు, ఈర్లపాడు, పెగళ్లపాడు, చుంచులూరు, పొంగూరుకండ్రిక, కంపసముద్రం, నాగినేనిగుంట, పడమటినాయడుపల్లి, మర్రిపాడు, పొంగూరు తదితర గ్రామాల్లో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే రాత్రికి రాత్రే దానిని యంత్రాలతో చదును చేయడం, జామాయిల్ మొక్కలు నాటి తమ భూమి అంటూ చెప్పుకోవడం పరిపాటిగా మారింది.
ఫిర్యాదులు చేసినా ఫలితమేదీ?
ఆక్రమణలకు పాల్పతున్న వారిపై స్థానిక ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలికంగా కొద్దిరోజులు ఆగి మళ్లీ ఆక్రమణదారులు యథావిధిగా తమ కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లను గతంలో వారే మార్చేశారు. ప్రస్తుతం వాటిని సాకుగా చూపి ఆ భూములు మావేనంటూ అధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాక మండలంలోని చిన్నమాచనూరు పంచాయతీ నెర్థనంపాడులో కోర్టు పరిధిలో ఉన్న భూములను సైతం ఆక్రమణ చేసి పొగాకు నార్లు వేసేందుకు సిద్ధమయ్యారంటే వారు ఎంతగా తెగిస్తున్నారో అర్థమవుతోంది. చుంచులూరు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు తన కుటుంబానికి సుమారు 100 ఎకరాలకు పైగా పొలం ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. ఇలా రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు తమ ఇష్టారీతిన చదును చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారే తప్ప అంతకుమించి ఏం చేయలేకపోతున్నారు. ఆక్రమణల పర్వం ఏ స్థాయికి వచ్చిందంటే మండలంలోని నాగినేనిగుంట పంచాయతీ బాట గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడి 10 మంది గాయపడేంత వరకు వచ్చింది. మండలంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు చొరవ చూపి ప్రభుత్వ భూములను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
రెవెన్యూ అధికారులకు సవాల్
విసురుతున్న భూఆక్రమణదారులు
హెచ్చరిక బోర్డులు పెట్టినా
వెనక్కి తగ్గని వైనం
ఆన్‌లైన్‌లో పేర్లు మార్పించుకుని
దురాగతం
మర్రిపాడు మండలంలో ఇదీ పరిస్థితి
కఠిన చర్యలు తీసుకుంటాం
మండలంలో మా దృష్టికి వచ్చిన భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా భూముల్లో ప్రభుత్వ భూములు అని తెలిపే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లు తెలిస్తే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే వాటిపై చర్యలు తీసుకుంటాం.
– అనిల్, ఇన్‌చార్జి తహసీల్దారు,
మర్రిపాడు
Comments
Please login to add a commentAdd a comment